
కోలీవుడ్‌లో హీరోగా రానా
టాలీవుడ్ కండల నటుడు రానా ఇప్పుడు కోలీవుడ్‌లో హీరోగా అవతారమెత్తనున్నారన్నది తాజా సమాచారం. తెలుగులో కథానాయకుడిగా పరిచయమైన రానా ఆ తరువాత ప్రతి కథానాయకుడిగా మారారు. అదే ఇప్పుడాయన్ని తమిళంలో కథానాయకుడిగా పరిచయానికి కారణం అయ్యిందని చెప్పవచ్చు. తెలుగు, తమిళం భాషలలో రూపొంది అద్భుత విజయాన్ని సాధించిన బాహుబలి చిత్రంలో రానా ప్రతినాయకుడిగా అద్భుత ప్రతిభను చాటిన విషయం తెలిసిందే.
అయితే అంతకు ముందే అజిత్ నటించిన ఆరంభం చిత్రంలో ఆయనకు మిత్రుడిగా ముఖ్యమైన పాత్రను పోషించి రానా ఇటీవల విడుదలైన బెంగళూర్ నాట్కళ్ చిత్రంలోనూ పాజిటివ్ పాత్రను చేశారు. తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న ఎన్నై నోక్కి పాయుమ్ తోటా చిత్రంలో, ద్విభాషా చిత్రం బాహుబలి-2 చిత్రంలోనూ విలన్‌గా నటిస్తున్నారు. ఇలా విలక్షణ పాత్రల్లో తెలుగు, తమిళం, హిందీ భాషలలో నటిస్తున్న రానా తొలిసారిగా తమిళంలో హీరోగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
ఇంతకు ముందు కృష్ణ హీరోగా కళుగు వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సత్యశివ తన తాజా చిత్రంలో రానాను హీరోగా ఎంచుకున్నట్లు తెలిసింది. ఇది చారిత్రక కథాంశంతో రూపొందనున్న ద్విభాషా(తమిళం, తెలుగు)చిత్రం. వచ్చే నెలలో చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిసింది. కాగా చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. రాజరాజన్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.