
పౌరాణిక చిత్రం 'రావణ'లో రానా..?
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రానా.. కెరీర్ స్టార్టింగ్ నుంచే స్టోరి సెలక్షన్ లో కొత్త దనం చూపిస్తూ దూసుకుపోతున్నారు. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించకుండా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నారు. తెలుగు తో పాటు తమిళ, హిందీ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో బాహుబలి సినిమాతో విలన్ గా జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు.
బాహుబలి సినిమాలో భల్లాలదేవగా ఆకట్టుకున్న రానా త్వరలో గుణశేఖర్ తెరకెక్కించబోయే హిరణ్యకశ్యపలోనూ నటిస్తున్నారు. అయితే తాజాగా రానా మరో పౌరాణిక చిత్రంలో నటించనున్నాడన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మంచు మోహన్ బాబు ప్రధాన పాత్రలో రావణ అనే పౌరాణిక చిత్రాన్ని నిర్మించేందుకు చాలా కాలం క్రితమే పనులు ప్రారంభించారు.
మోహన్ బాబు రావణుడి పాత్రలో నటించనున్న ఈ సినిమాను రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. పలువురు కోలీవుడ్, బాలీవుడ్ నటులు ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ సినిమాతో రానా ఆంజనేయుడిగా నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జానపద, చారిత్రక పాత్రలతో ఆకట్టుకున్న రానా, త్వరలో పౌరాణిక చిత్రంతోనూ మెప్పించేందుకు రెడీ అవుతున్నారు.