మళ్లీ... అదే కాంబినేషన్?
ప్రేమకథలు.. అవి సుఖాంతమైనా, విషాదాంతమైనా హృదయానికి హత్తుకునేలా తెరకెక్కిస్తుంటారు ప్రముఖ హిందీ సినీ దర్శక - నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ. ‘దేవదాస్’, ‘సావరియా’, ‘గోలియోం కీ రాస్‌లీలా... రామ్-లీల’, ఇటీవలి ‘బాజీరావ్ మస్తానీ’ తదితర చిత్రాలు అందుకు ఓ ఉదాహరణ. తాజాగా మరో చారిత్రక ప్రణయగాథను తెరకెక్కించే ప్రయత్నంలో భన్సాలీ ఉన్నారు.
ఖిల్జీ వంశానికి చెందిన సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ, అప్పటి చిత్తోడ్ మహారాణి పద్మావతి జీవితాల ఆధారంగా ఈ చారిత్రక కథాచిత్రం ఉంటుంది. రాణి మీద మనసుపడ్డ అల్లావుద్దీన్ ఆమె భర్త అయిన రాజా రతన్ సింగ్‌పై యుద్ధం ప్రకటిస్తాడు. తెలివైనవాడు, మొండివాడైన అల్లావుద్దీన్ ఖిల్జీ ఎలాగైనా పద్మావతిని దక్కించుకొని తీరాలనే పట్టుదలతో ఉంటాడు. అల్లావుద్దీన్‌ని ఎదుర్కోవడానికి చివరకు రాణి రంగంలోకి దిగాల్సి వస్తుంది. ఈ చరిత్ర ఆధారంగానే ‘పద్మావతి’ టైటిల్‌తో సినిమా తీయనున్నారు భన్సాలీ. పద్మావతి పాత్రకు దీపికా పదుకొనేని అనుకున్నారట.
ఈ బ్యూటీకి టూకీగా కథ కూడా వినిపించారని సమాచారం. కథ నచ్చడంతో దీపిక పచ్చజెండా ఊపేశారట. అయితే, డేట్లు సర్దుబాటు చేయాల్సి ఉంది. మరోపక్క ఇటీవలి ‘బాజీరావ్ మస్తానీ’లో రణ్‌వీర్ సింగ్, దీపికల జంట చూడముచ్చటగా అనిపించింది. ఆ దిశలో ఆలోచించి యాంటీ హీరో ఛాయలున్న అల్లావుద్దీన్ పాత్రకు రణ్‌వీర్ సింగ్‌ని తీసుకుంటారేమో అని ముంబయ్ టాక్.
ఇదిలా ఉంటే, ‘బాజీరావ్ మస్తానీ’కి సంభాషణలు రాసిన ప్రకాశ్ ఆర్. కపాడియా ఈ తాజా చిత్రానికి సంభాషణలు రాసే పని మీద ఉన్నారట. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చే 2017 డిసెంబర్ 15న రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు భన్సాలీ ప్రకటించడం విశేషం. అంటే, మరోసారి హీరోయిన్‌కు ప్రాధాన్యం ఉండే ‘బాజీరావ్ మస్తానీ’ తరహా లవ్‌స్టోరీ తెరపై ఖాయమన్నమాట!