
కేక పెట్టిస్తున్న 'రత్తాలు రత్తాలు'
సంక్రాంతి కానుకగా త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150, ప్రమోషన్ లో స్పీడు పెంచుతుంది. ఇప్పటికే మూడు పాటలతో అభిమానులను అలరించిన ఖైదీ.., ఇప్పుడు మెగా మార్క్ మ్యాజిక్తో ఫ్యాన్స్కు కిక్ ఇచ్చాడు. మాస్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ లాంటి మెగాస్టార్ ఫుల్ మాస్ సాంగ్కు ఆడిపాడి దశాబ్దం పైగానే అయ్యింది. ఇన్నేళ్ల తరువాత ఓ ఫుల్ మాస్ బీట్తో అలరించాడు చిరు.
దేవీ శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రత్తాలు రత్తాలు అంటూ ఉర్తూతలూగించే మాస్ బీట్స్కు ఇరగదీసే స్టెప్స్ వేశాడు. చిరు కెరీర్లో బిగెస్ట్ హిట్స్గా నిలిచిన పాటలకు కొరియోగ్రఫీ చేసిన లారెన్స్ మాస్టర్ ఈ మాస్ సాంగ్కు కొరియోగ్రఫీ అందించాడు. చిరు పక్కన అందాల భామ లక్ష్మీ రాయ్ ఆడిపాడింది. మేకింగ్ బిట్స్తో రత్తాలు పాటను రిలీజ్ చేశారు. ఈ పాటతో కలిపి ఇప్పటికే నాలుగు పాటలు రిలీజ్ కాగా.. ఈరోజు రాత్రి పూర్తి ఆల్బమ్ను ఆన్లైన్ లోకి రిలీజ్ చేస్తున్నారు. అభిమానుల కోసం జనవరి 4న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు.