
విడుదలకు సిద్ధమైన చండీకుదిరై
చండీకుదిరై చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి అయ్యాయని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు అన్భుమణి వెల్లడించారు. ఇంతకు ముందు 350కి పైగా కథలను రాసిన ఈయన పలు బుల్లి తెర సీరియళ్లకు పనిచేశారు. చండీకుదిరై చిత్రం ద్వారా వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సన్‌మూన్ కంపెనీ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రాజ్‌కమల్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈయన బుల్లితెరలో ప్రాచుర్యం పొందిన నటుడే. మానస కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో గంజాకరుప్పు, దిల్లీగణేశ్, సూర్యకాంత్, బొండామణి, రిషీఅరుళ్, పెరుమాయి ముఖ్య పాత్రలు పోషించారు. 600లకు పైగా భక్తి గీతాలను రాసి ప్రాచుర్యం పొందిన వారాశ్రీ ఈ చిత్రానికి సాహిత్యాన్ని, సంగీతాన్ని అందించారు. చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఈ నాగరిక రోజుల్లో ఆహారం లేకున్నా కొన్ని రోజులు జీవించగలం కానీ, చేతిలో సెల్‌ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి అన్నారు. ముఖ్యంగా సెల్ఫీ మోహం బాగా పెరిగిపోయిందన్నారు.
అలాంటి సెల్ఫీ మోహం కారణంగా ఒక యువజంట ఎలాంటి సమస్యలకు గురయ్యారన్న ఇతి వృత్తంతో రూపొందించిన చిత్రమే చండీకుదిరై అన్నారు. విజ్ఞానాభివృద్ధి మరో పక్క వినాశనానికి దారి తీస్తుందన్న వాస్తవాన్ని ఆవిష్కరించే చిత్రం చండీకుదిరై అని తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయిన ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చిత్రానికి పి.ప్రకాశ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.