అది చూసి వణికి పోయాం! | The leopard came and showed the killing scenes of this dog. | Sakshi
Sakshi News home page

అది చూసి వణికి పోయాం!

Published Mon, Jun 26 2017 12:39 AM | Last Updated on Tue, Sep 5 2017 2:27 PM

అది చూసి వణికి పోయాం!

అది చూసి వణికి పోయాం!

ఊహించని సంఘటనలు జరగడమే జీవితం. అయితే ఒక్కోసారి ఎదురైన భయంకర సంఘటలను ఎప్పటికీ మరువలేం. మేల్‌నాట్టు మరుమగన్‌ చిత్ర యూనిట్‌ అలాంటి సంఘటనే చవి చూసిందట. ఉదయ క్రియేషన్స్‌ పతాకంపై మనో ఉదయకుమార్‌ నిర్మిస్తున్న చిత్రం మేల్‌నాట్టు మరుమగన్‌.

రాజ్‌కమల్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ఆండ్రియన్‌ నాయకిగా పరిచయం అవుతోంది. కాగా వీఎస్‌.రాఘవన్, అంజలిదేవి, అశోక్‌రాజ్, శాంతయ్య ముఖ్యపాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను ఎంఎస్‌ఎస్‌ నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌లో జరిగిన ఒక ప్రాణ భయం లాంటి సంఘటన గురించి దర్శకుడు తెలుపుతూ ఇటీవల చిత్రంలోని యారో ఇవన్‌ యార్‌ ఇవనో అనే పాటను చిత్రీకరించడానికి కొత్తగిరి ప్రాంతానికి వెళ్లామని తెలిపారు. అక్కడ తాను, ఛాయాగ్రాహకుడు తదితర చిత్ర యూనిట్‌ ఒక ఇంట్లో బస చేశామన్నారు.

ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లినా, బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చినా తనకు ముందుగా తెలియజేయాలని ఆ ఇంటి యజమాని హెచ్చరించాడన్నారు. ఇది ప్రమాదకరమైన ప్రాంతం అని, పులులు తిరుగుతుంటాయని చెప్పాడన్నారు. తామూ అతను చెప్పినట్లే నడుచుకున్నామని తెలిపారు. అతను తుపాకీ చేతపట్టి తమను క్షేమంగా తీసుకెళ్లేవాడని చెప్పారు. ఆ వ్యక్తి ఇంట్లో ఒక పెద్ద వేట కుక్కను పెంచుకున్నాడని తెలిపారు. ఒక రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో షూటింగ్‌ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చామన్నారు. ఉదయం లేచి చూడగా ఇంటి యజమాని పెంచుకున్న కుక్క కనిపించకపోవడంతో ఏమైందని అడగ్గా అతను సీసీ కెమెరాలో నమోదైన సన్నివేశాలను చూపించాడన్నారు.

అది చూసి తాము భయంతో వణికి పోయామన్నారు. ఆ రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒక చిరుతపులి వచ్చి ఈ కుక్కను చంపేసింది. తాము కాస్త ఆలస్యంగా వచ్చి ఉంటే ఆ చిరుతపులి బారిన పడేవాళ్లమన్న సంఘటనను తలచుకుంటేనే భయంతో వణుకుపుడుతోందన్నారు.  అలా పలు కష్టాలను ఎదుర్కొని తెరకెక్కిస్తున్న చిత్రం మేల్‌నాట్టు మరుగన్‌ అని దర్శకుడు చెప్పారు. చెన్నై, మహాబలిపురం, తిరుచ్చి, తంజావూర్‌లలో చిత్రీకరణను పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement