
అది తలచుకుంటేనే వణుకు పుడుతోంది..
మేల్‌నాట్టు మరుమగన్ చిత్ర యూనిట్ ఓ ప్రమాదకరమైన అనుభవాన్ని చవిచచూసిందట. ఉదయ క్రియేషన్స్ పతాకంపై మనో ఉదయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను ఎంఎస్ షజాగన్(ఎంఎస్ఎస్) నిర్వహిస్తున్నారు. తమకు ఎదురైన అనుభవాన్ని గురించి ఎంఎస్ఎస్ వివరించారు. చిత్రంలోని యారో ఇవన్ యార్ ఇవనో అనే పాటను చిత్రీకరించడానికి కొత్తగిరి ప్రాంతానికి వెళ్లామన్నారు. అక్కడ తాను, ఛాయగ్రహకుడు తదితర చిత్ర యూనిట్ ఓ ఇంట్లో బస చేశామని చెప్పారు. ఆ ప్రాంతం ప్రమాదకరమైనదని.. పులులు తిరుగుతుంటాయని, ఇంటి నుంచి బయటకు వెళ్లినా, బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చినా ముందుగా తెలియజేయాలని ఆ ఇంటి యజమాని హెచ్చరించాడన్నారు.
అతను తుపాకీ చేతబట్టి తమను క్షేమంగా తీసుకెళ్లేవాడని చెప్పారు. ఒక రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో షూటింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చామని తెలిపారు. ఉదయం లేచి చూడగా ఇంటి యజమాని పెంచుకుంటున్న కుక్క కనిపించకపోవడంతో ఏమయ్యిందని అడిగాము. అతను సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను చూపాడన్నారు. అది చూసి తాము భయంతో వణికి పోయామన్నారు. ఆ రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒక చిరుతపులి వచ్చి కుక్కను చంపేసిందని ఎంఎస్ఎస్ చెప్పారు. తాము కాస్త ఆలస్యంగా వచ్చి ఉంటే ఆ చిరుతపులి బారిన పడేవాళ్లమని, ఆ సంఘటనను తలచుకుంటేనే భయంతో వణుకుపుడుతోందన్నారు.