
సాక్షి, తిరుపతి: జూపార్క్ రోడ్డులో చిరుత కలకలం రేపింది. సైన్స్ సెంటర్ వద్ద రోడ్ క్రాస్ చేస్తున్న చిరుతను బైక్ ఢీకొట్టింది. దీంతో టీటీడీ ఉద్యోగి మునికుమార్ బైక్ నుంచి పడి తీవ్రంగా గాయపడ్డారు. రుయాకు ఆసుపత్రికి తరలించారు. అటవీ ప్రాంతంలోకి చిరుత పారిపోయింది.
కాగా, ఎస్వీయూలో చిరుత కదలికలనూ ప్రత్యేకంగా అమర్చిన 10 సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్టు ఫారెస్ట్ అధికారులు ఎఫ్‌ఆర్‌ఓ సుదర్శన్, వన్యప్రాణి జీవశాస్త్రవేత్త సౌజన్య తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం వర్సిటీ రిజిస్ట్రార్ భూపతి నాయుడును కలిసి వర్సిటీ ప్రాంగణంలో చిరుత కదలికలపై పూర్తి సమాచారాన్ని అందించారు. అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ వర్సిటీలో ప్రధానంగా రాత్రి ఒంటిగంట సమయంలో జంటలు జంటలుగా తిరుగుతున్నారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
క్యాంటీన్ల వద్ద ఆహార వ్యర్థాల నిర్వహణ సరిగా లేదని, దీంతో వీధి కుక్కల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. వర్సిటీ విద్యార్థులు, ఉద్యోగులు, పాదచారులు, వర్సిటీలోకి వచ్చే బయటి వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు వర్సిటీలో తిరగకూడదని, ఎక్కడబడితే అక్కడ కూర్చోకూడదని స్పష్టం చేశారు. చిరుత తనకన్నా చిన్న సైజు కలిగిన జంతువులను, కుక్కలను, జింకలను, ఆవులు, గేదెలను ఆహారంగా తీసుకెళుతుందన్నారు.
వర్సిటీలో కుక్కల బెడద చిరుతకు మంచి అవకాశంగా చేసుకుందని, వ్యర్థ ఆహార పదార్థాల నిర్వహణను క్యాంటీన్ల వద్ద, హాస్టల్లో విధిగా పాటించాలని చెప్పారు. కుక్కల కోసం పాదచారులు ఆహారాన్ని అందించకూడదన్నారు. జాగ్రత్త పట్టికలను ఏర్పాటుచేసి అందులో ఈ మెయిల్స్ వాట్సాప్, ఫోన్ నంబర్ల వివరాలు ఉంచాల ని సూచించారు. వర్సిటీకి అడవి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ నివాసం ఉండేవారు పెంపుడు జంతువులు పెంచుకోకూడదని సూచించారు. చిరుత సంచారాన్ని గుర్తిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

ఇదీ చదవండి: ఎటు చూసినా సంక్రాంతి రద్దీ.. ప్రత్యేక రైళ్లతో ప్రయాణికులకు చుక్కలే
Comments
Please login to add a commentAdd a comment