నిజ జీవిత కథానాయకుడు అక్కినేని | Real hero in real life akkineni nageswara rao | Sakshi
Sakshi News home page

నిజ జీవిత కథానాయకుడు అక్కినేని

Published Sun, Sep 20 2015 1:28 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

తొలి సినిమా సీతారామ జననం చిత్రంలో అక్కినేని - Sakshi

తొలి సినిమా సీతారామ జననం చిత్రంలో అక్కినేని

‘బతికి బావుకునేది లేదని చావబోకు- చచ్చి సాధించేది లేదని బతకబోకు-బతికి జీవితాన్ని సాధించు-చనిపోయి కలకాలం జీవించు’. ఇవి అక్కినేని నాగేశ్వరరావు తన ‘అ-ఆలు’ (అక్కినేని ఆలోచనలు)పుస్తకంలో రాసుకున్న మా(పా)టలు. దీనికి నిలువెత్తు నిర్వచనం ఆయన జీవితమే.
 
కృష్ణాజిల్లాలోని మారుమూల కుగ్రామంలో జన్మించి, చదువు సంధ్యలు అంతమాత్రంగానే అబ్బిన ఓ కుర్రవాడు, నాటకాలలో ఆడపిల్లల వేషాలు వేస్తుండగా..గుడివాడ స్టేషనులో ఓ నిర్మాత కంటబడటం, సినీ రంగంలో అడుగుపెట్టడం.. తొలి దశలో ఎన్ని అవమానాలు ఎదురైనా..  మొక్కవోని దీక్షతో క్రమశిక్షణ, పటుట్టదలతో ఇంతింతై..వటుడింతై అన్నట్టుగా ఎదగడం నిజంగా అద్భుతం.. ఇది తెలుగు సినిమా కథ కాదు, నిజ జీవిత కథానాయకుని కథ. సినీ రంగాన్ని ఏలిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు దీక్షాదక్షత.
 
 గోదావరితో ఏఎన్నార్ అనుబంధం
గోదావరి తీరంతో అక్కినేనికి ఎనలేని సంబంధం ఉంది. ఔట్ డోర్ షూటింగుకు నటులు అంతగా ఇష్టపడని రోజుల్లో ఆయన మూగమనసులు సినిమాలో హీరోగా నటించారు. దాని చిత్రీకరణ గోదారి ఒడ్డునే జరిగింది. జిల్లాలోని పులిదిండి, ర్యాలి గ్రామాల్లో చిత్రీకరణ జరుపుకున్న బుద్ధిమంతుడు సినిమాకీ ఆయనే హీరో..  అందాల రాముడు, సీతారామయ్యగారి మనుమరాలు, సూత్రధారులు, శ్రీరామదాసు ఇలా ఏఎన్నార్ నటించిన ఎన్నో చిత్రా లు గోదారి ఒడ్డున ప్రాణం పోసుకున్నాయి. అన్నీ అఖండ విజయాలే. గోదారి తీరాన ఉన్న ఎందరో కళాకారులు, చిత్రకారులు, సాహితీవేత్తలతో అక్కినేనికి మంచి సాన్నిహిత్యం ఉంది. రాజమండ్రి టీ నగర్‌లోని పాల గంగరాజు దుకాణంలో లభించే పాలకోవా అంటే అక్కినేనికి ప్రాణం.
 
 
 నాకు డైలాగ్ పెట్టమన్నారు.
1955లో రోజులు మారాయి శతదినోత్సవానికి అక్కినేని రాజమండ్రి వచ్చారు. నా అన్న శ్రీపాదపట్టాభి ద్వారా అప్పుడే అక్కినేనితో నాకు పరిచయమైంది. ఆయన తుది శ్వాస విడిచే వరకు ఆ పరిచయం అలాగే దినదినప్రవర్ధమానమైంది. తొలిసారిగా బాపు, రమణలు తీసిన బుద్ధిమంతుడు సినిమాలో నాకు ఆయనతో నటించే అవకాశం లభించింది.

పతాక సన్నివేశంలో విలన్ పాత్రధారి నాగభూషణాన్ని అరెస్టు చేసే పోలీస్ అధికారి పాత్రను నాకు ఇచ్చారు. ‘మన జిత్‌కు డైలాగ్ పెట్టండి’ అని ఆయన రచయిత ముళ్లపూడికి సూచించారు. అందారాముడు, సూత్రధారులు, శ్రీరామదాసు.. ఇలా ఎన్నో చిత్రాలలో ఆయనతో కలసి నటించాను. దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు ఆయన అందుకున్నాక, తొలి సన్మానం నా చేతులమీదుగా రాజమండ్రిలోనే జరగడం నా అదృష్టం.
 - జిత్ మోహన మిత్ర, గాయకుడు, రంగస్థల, సినీనటుడు
 
 అహంభావం అణువంత కూడా లేదు
 2007 మేలో గోదావరీ తీరాన శ్రీరామదాసు షూటింగ్ జరుగుతోంది. నాది భక్తునిగా ఒక చిన్న పాత్ర. మిమ్మల్ని కలవడం, కలసి నటించడం చాలా ఆనందంగా ఉందని ఆయనతో అన్నాను. ఆయన ఆప్యాయంగా నా ఉద్యోగం, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీరిక సమయాల్లో కళారంగానికి సంబంధించిన ఎన్నో సత్యాలను ఆవిష్కరించేవారు. ఆయన ఎంత గొప్ప నటుడో, వ్యక్తిగా కూడా అంత గొప్పవారు.
 - నేదునూరి గోపాలకృష్ణ, విశ్రాంత ఉపాధ్యాయుడు.
 
 
 చిన్నతనం నుంచి ఆయనకు అభిమానినే
 ఉద్యోగరీత్యా బాపట్లలో బ్యాంకులో పనిచేస్తున్న నేను ఒకసారి హైదరాబాద్ బ్యాంకు పనిమీద వెళ్లాను. నేను సేకరించిన అక్కినేని ఫొటోలతో కూడిన ఆల్బమ్‌ను ఆయనకు చూపించా. వాటిని చూసి ఈ ఫొటోలు  నా వద్ద కూడా లేవే అన్నారు. 1953లో దేవదాసు శతదినోత్సవం సందర్భంగా ఆయన, సావిత్రి, పేకేటి శివరాం వచ్చారు. వరద రోజులు. అప్పుడు  హోటళ్లు లేవు. వచ్చిన నటీనటులు వాడ్రేవువారి భవనంలో దిగారు. అప్పుడు నేను తొలిసారిగా అక్కినేనిని చూశాను. ఓసారి అక్కినేని పుట్టినరోజున నేను ఆయన బొమ్మగీసి పంపితే, ఆయన అభినందనలు తెలియజేస్తూ లేఖ రాసారు. నాగేశ్వరరావు అరుదైన నటుడు.
 - ఎం.వి.అప్పారావు (సురేఖ), విశ్రాంత బ్యాంకు ఉద్యోగి, కార్టూనిస్టు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement