మంచి చిత్రాలకు ఆదరణ
మంచి చిత్రాలకు ఆదరణ
Published Thu, Sep 19 2013 1:47 AM | Last Updated on Thu, Apr 4 2019 5:42 PM
న్యూఢిల్లీ: మంచి చిత్రాలకు ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందని తన కాయ్ పోచే నిరూపించిందని దర్శకుడు అభిషేక్ కపూర్ తెలిపాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో తన తదుపరి చిత్రం ‘ఫితూర్’ షూటింగ్ మొదలవుతుందన్నాడు. ‘కాయ్‌పోచే’ విజయవంతం కావడంతో ప్రస్తుతం అతడు ‘ఫితూర్’ స్క్రిప్ట్ పనిలో పడ్డాడు. ఈ సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ..‘ ప్రముఖ ఆంగ్ల రచయిత చార్లెస్ డికెన్స్ రచించిన ‘ది గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్’ ను ఆధారంగా చేసుకుని ఫితూర్ కథను తయారుచేస్తున్నాను.
ఇందులో సుషాంత్ సింగ్ రాజ్‌పుత్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్నారు. నాతో పాటు వారిద్దరూ ఈ సినిమాపై చాలా ఆసక్తిగా ఉన్నారు..’ అని చెప్పాడు. కత్రినా తో అభిషేక్‌కు ఇది మొదటి సినిమా కాగా, సుషాంత్ సింగ్ ఇప్పటికే అభిషేక్ దర్శకత్వం వహించిన ‘కాయ్ పో చే’ సినిమాలో నటించాడు. ‘ఫితూర్ చిత్ర కథకు హీరోహీరోయిన్లుగా సుషాంత్, కత్రినా జంట సరిగ్గా సరిపోతారు. ది గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్ కథ పిప్ అనే ఒక అనాధ బాలుడికి సంబంధించింది. అతడు ఎస్టెల్లా అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమె ధనవంతురాలే కాని ఏమాత్రం మానవత్వం ఉండదు..’ అని చెప్పాడు.
‘కాయ్ పోచే’ వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుకు భారతదేశం నుంచి అధికారికంగా ఎంట్రీ పొందింది. తన సినిమా ఆస్కార్ నామినేషన్ గురించి ఎక్కువగా మాట్లాడటానికి అభిషేక్ ఇష్టపడలేదు. ‘ఆస్కార్ ఎంపిక గురించి నాకు ఏమాత్రం అవగాహన లేదు. ప్రేక్షకులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మంచి చిత్రాన్ని వారు ఆదరిస్తారు. కాయ్ పోచేపై పూర్తి విశ్వాసంతో పనిచేశాను.
ఆ మేరకు ఆత్మసంతృప్తి పొందాను..’ అని అన్నాడు. అభిషేక్ బాలీవుడ్‌లో 1996లో ‘ఉఫ్.. ఏ మొహబ్బత్’ అనే సినిమాతో నటుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. 2006లో విడుదలైన ఆర్యన్ సినిమాతో దర్శకుడిగా మారాడు. తనకు డబ్బు ఒక్కడే ముఖ్యం కాదని అతడు స్పష్టం చేశాడు. ‘నాకు ఇష్టమైన పనిని మాత్రమే చేస్తాను.. దాని కోసం ఎంతకాలమైనా ఎదురుచూస్తాను..’ అని అభిషేక్ అంటాడు.
Advertisement