Abhishek Kapoor
-
చండీగఢ్ కరే ఆషికీ..ఈ కథకు ధైర్యం ఎక్కువ
‘నాకు కొడుకువైనా కూతురివైనా నువ్వే’ అని సాధారణంగా అంటూ ఉంటారు. కాని కొడుకు కూతురిగానో కూతురు కొడుకుగానో నిజంగా మారిపోతే? ‘దేవుడు తప్పు చేశాడు... ఆమె సరిదిద్దుకుంది’ అంటుంది ఈ సినిమాలో డాక్టర్. బాలీవుడ్లో విడుదలైన తాజా సినిమా ‘చండీగఢ్ కరే ఆషికీ’ (చండీగఢ్ ప్రేమ). ఇది ‘ట్రాన్స్ గర్ల్’ లవ్ స్టోరీ. అమ్మాయిగా మారిపోయిన అబ్బాయి తన ప్రేమను గట్టి వ్యక్తిత్వంతో సాధించుకున్న కథ. ఇలాంటి కథకు సాహసం కావాలి. దీనిని చర్చకు పెట్టేందుకు మనసు కావాలి. జనవరి 7న ఓటిటిలో విడుదలైన వెంటనే అత్యధిక వ్యూయర్షిప్ పొందిన ఈ సినిమా పరిచయం. దేవుడు నిజంగానే ఒక్కోసారి తప్పు చేస్తాడు. అమ్మాయిని అబ్బాయిగానూ అబ్బాయిని అమ్మాయిగానూ పుట్టిస్తాడు. కాని లోక ఆచారం ప్రకారం ఒక్కసారి అబ్బాయిగా పుట్టాక చచ్చినట్టు అబ్బాయిగా బతకాల్సిందే. అమ్మాయిగా పుట్టాక అమ్మాయిగా జీవించాల్సిందే. ‘మా శరీరాలు తప్పుగా ఉన్నాయి. లోపల మా భావాలు వేరుగా ఉన్నాయి. మమ్మల్ని మాలాగా మేము కోరుకున్నలాగా మారనివ్వండి’ అనంటే సమాజం ఊరుకోదు. తల్లిదండ్రులు ఒప్పుకోరు. కాని ట్రాన్స్‌జెండర్స్ ధైర్యంగా ముందుకు వస్తున్నారు. తాము కోరుకున్న రూపాలను పొందుతున్నారు. తమ హక్కులను కోర్టులకు వెళ్లి సాధించుకుంటున్నారు. ఇప్పుడు తమ కలలను ఆకాంక్షలను కౌటుంబిక జీవనాన్ని కూడా సాధించే ప్రయత్నాల్లో పడుతున్నారు. అందుకు సంఘాన్ని సిద్ధం చేస్తున్నారు. ‘చండీగఢ్ కరే ఆషికీ’ ఈ ప్రస్తావన చేస్తోంది. ఆ అంశంతో సినిమా గా ముందుకు వచ్చింది. నిజానికి సినిమా అంటే వ్యాపారం. ‘సెంటిమెంట్’ బెడిసి కొడితే అసలుకే ఎసరు వస్తుంది. కాని ఈ సినిమాలో చాలా సున్నితంగా గౌరవంతో సమస్యను చర్చించారు. అందుకే ప్రేక్షకులు కూడా గౌరవిస్తున్నారు. ఏంటి కథ? చండీగఢ్‌లో ఒక దివాలా తీసిన జిమ్‌ను నడుపుతుంటాడు ఆయుష్మాన్ ఖురానా. తను స్వయంగా బాడీ బిల్డర్ అయినా ప్రతి ఏటా చండీగఢ్‌లో జరిగే ‘బలసంపన్నుల పోటీ’లో ఛాంపియన్‌గా నిలువలేక నంబర్ 2లో వస్తున్నా అతని జిమ్‌కు గిరాకీ ఉండదు. ఆ సమయంలో వాణి కపూర్ ఆ జిమ్‌కు జుంబా ఇన్‌స్ట్రక్టర్‌గా వస్తుంది. ఆమె రాకతో జిమ్‌కు కళ వస్తుంది. అమ్మాయిలు చేరడంతో అబ్బాయిలూ రావడం మొదలెడతారు. క్రమంగా ఆయుష్మాన్ ఖురానా, వాణి కపూర్ ప్రేమలోనూ ఆ తర్వాత శారీరక సంబంధంలోనూ వెళతారు. ‘ఇక మనం పెళ్లి చేసుకుందాం’ అంటాడు ఆయుష్మాన్. అప్పుడు వాణి కపూర్ అతి కష్టం మీద తానెవరో చెబుతుంది. ‘నేను అబ్బాయిగా పుట్టాను. అమ్మాయిగా మారాను. నేనొక ట్రాన్స్గర్ల్ని’ అంటుంది. ఆయుష్మాన్‌కు చాలా పెద్ద దెబ్బగా ఇది అనిపిస్తుంది. తనను వాణికపూర్ వంచించినట్టుగా భావిస్తాడు. పైగా ‘సంప్రదాయ ఆలోచన’ ల ప్రకారం తాను సృష్టి విరుద్ధ శృంగారంలో పాల్గొన్నట్టుగా భావించి తనను తాను అసహ్యించుకుంటాడు. వాణికపూర్ను అవమానిస్తాడు. అతడిని మిత్రులు అవమానిస్తారు. ఊరు అవమానిస్తుంది. కాని ఆయుష్మాన్‌లో ఆమె పట్ల ప్రేమ పోదు. ఆమెకు అతని పట్ల కూడా. కాని ఇది ఓడిపోయే ప్రేమ కథ. ఇన్నాళ్లు విన్నటువంటి ప్రేమ కథ కూడా కాదు. చివరకు ప్రేమ గెలుస్తుంది. నిజమైన శౌర్యం ఏమిటి? సినిమాలో ఆయుష్మాన్ వెయిట్ లిఫ్టర్. తన శౌర్యం నిరూపించుకోవాలనుకుంటాడు. కాని నిజమైన శౌర్యం ఏమిటి? సమాజానికి వెరవకపోవడం... తన ప్రేమలోని నిజాయితీని స్వీకరించడం... వాణికపూర్ మారిన అస్తిత్వాన్ని గౌరవించడం. ‘నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. తొందరగా ఇలాంటివి అర్థం కావు. టైమ్ పడుతుంది’ అంటాడు పశ్చాత్తాపంతో వాణికపూర్‌తో. అతనే కాదు... ట్రాన్స్‌జెండర్స్ విషయంలో కుటుంబాలు ఎంత కఠినంగా ఉంటాయో ఎన్నో ఉదంతాలు ఉంటాయి. సినిమాలో అబ్బాయిగా పుట్టిన వాణి కపూర్ సర్జరీ చేయించుకుని పూర్తిగా అమ్మాయిగా మారుతుంది. దీనిని తండ్రి అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తాడు కాని తల్లి అస్సలు సహించదు. చండీగఢ్‌లో ఆయుష్మాన్‌తో ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టాక స్నేహితురాలు ‘నువ్వు ఊరు విడిచి నాలుగురోజులు ఎటైనా పోరాదూ’ అంటుంది. దానికి వాణి కపూర్ ‘నా ఇంట్లో అవమానిస్తున్నారని ఇల్లు వదిలాను. ఊళ్లో అవమానిస్తున్నారని నా ఊరైన అంబాలాను విడిచి పెట్టి ఇక్కడకు వచ్చాను. ఇక్కడ అవమానిస్తున్నారని ఎక్కడకు వెళ్లాలి’ అంటుంది. ‘నా తప్పు ఏమిటి? నేను చిన్నప్పటి నుంచి నన్ను నేను అమ్మాయిగా భావించాను. నాకిష్టం వచ్చినట్టు మారాను’ అంటుంది వాణి కపూర్. కుటుంబం, సమాజం అర్థం చేసుకోవాల్సింది ఈ మానసిక శారీరక అవస్థనే. అందరూ పుట్టినట్టే ట్రాన్స్‌జెండర్స్ కూడా పుడతారు. కాని వారిని హిజ్రాలంటూ గేలి చేసే దుర్మార్గ సంస్కృతి సమాజంలో ఉంది. వారు తాము కోరుకునే అస్థిత్వంతో ప్రేమ, వివాహం, జీవితం సోకాల్డ్ ‘నార్మల్’ వ్యక్తులతో పొందడానికి ఎన్నో అడ్డంకులు. భేషజాలు. అపోహలు. వాటన్నింటిని మెల్లగా దాటాలి అని చెబుతుంది ఈ సినిమా. ‘జెండర్ ఇన్‌క్లూజివిటీ’... అంటే అన్ని జెండర్ల వాళ్లను సమాజం అంతర్భాగం చేసుకోవాలనే సందేశం ఇవ్వడానికే ఈ సినిమా తీశారు. దర్శకుడిదే ఘనత ఈ సినిమా ఇంత సున్నితంగా, ఆలోచనాత్మకంగా, ఒప్పుకోలుగా ఉండటానికి కారణం దర్శకుడు అభిషేక్ కపూర్ తీసిన పద్ధతి. దానికి హీరో హీరోయిన్లు సపోర్ట్ చేసిన పద్ధతి. ఈ సబ్జెక్ట్ చేయడం ఆయుష్మాన్‌కు సాహసం కాదు కాని వాణి కపూర్‌కు సాహసమే. తనను తాను ట్రాన్స్గర్ల్గా బిలీవ్ చేసి ఆ పాత్ర ఆత్మాభిమానం తాలూకు డిగ్నిటీని ప్రదర్శించింది ఆమె. మధ్య మధ్య చెణుకులతో ఈ సినిమా నవ్విస్తుంది. కాని ఈ సమస్యను చాలా సీరియస్‌గా తీసుకోమంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది చూడండి. -
బాలీవుడ్‌కి హాయ్
‘అర్జున్‌రెడ్డి’ విజయంతో క్రేజీ స్టార్ అయ్యారు హీరో విజయ్ దేవరకొండ. ఇప్పుడాయన బాలీవుడ్ ఎంట్రీ ఖరారయిందని సమాచారమ్. హిందీలో ‘కాయ్ పో చే’, ‘కేదార్నాథ్’ తదితర హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఓ సినిమాతో విజయ్ ఎంట్రీ ఇవ్వనున్నారట. ఈ సినిమాకు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, భూషణ్‌కుమార్ సహనిర్మాతలుగా వ్యవహరించనున్నారని సమాచారం. గత ఏడాది భారత్–పాకిస్తాన్ సైనికుల మధ్య జరిగిన దాడిలో భారత వింగ్‌కమాండర్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ సైనికుల చేతికి చిక్కిన విషయం తెలిసిందే. మూడు రోజులు బంధీగా ఉంచి, పాక్ ప్రభుత్వం అభినందన్‌ని భారత ప్రభుత్వానికి అప్పగించింది. అభినందన్ జీవితం ఆధారంగా అభిషేక్ కపూర్ ఈ సినిమా రూపొందించనున్నారట. ఈ స్క్రిప్ట్‌ని విజయ్ దేవరకొండ విని, నటించడానికి అంగీకరించారని సమాచారం. అభినందన్ పాత్రనే విజయ్ చేయనున్నారట. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్‌కి విజయ్ దేవరకొండ సంతకం చేయలేదని బాలీవుడ్ టాక్. -
బాలాకోట్ దాడులపై రెండో సినిమా..
యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో బాలీవుడ్ దర్శకనిర్మాతలు ముందంజంలో ఉంటారు. సినిమాలు తీయడమే కాకుండా వారి రికార్డులు వారే తిరగరాసుకుంటారు. ఈ క్రమంలో హిందీలో తాజాగా మరో యదార్థ ఘటనల ఆధారంగా ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనినే కథాంశంగా తీసుకొని సినిమా తీయనున్నట్లు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రకటించారు. భూషణ్ కుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘కేదార్నాథ్’ దర్శకుడు అభిషేక్ కపూర్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడని తెలిపారు. ఈ భారత సైన్య పోరాటాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నామని భూషణ్ కుమార్ తెలిపారు. భారత ఆర్మీ ధైర్యసాహసాలకు ప్రతీకగా ఈ సినిమా నిర్మితమవుతుందన్నారు. జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో బాంబులు వర్షం కురిపించి ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేసింది. అయితే ఆ సమయంలో భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ చేతికి చిక్కగా, అనూహ్య పరిణామాల తర్వాత తిరిగి భారత్‌కు చేరుకున్నాడు. ఆయన ధైర్యసాహసాలను మెచ్చిన భారత ప్రభుత్వం అభినందన్‌కు ‘వీర్‌చక్ర’ పురస్కారాన్ని అందించింది. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని ‘బాలాకోట్- ది ట్రూ స్టోరీ’ సినిమా తీస్తానని ప్రముఖ నటుడు, నిర్మాత వివేక్ ఒబెరాయ్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు ఒకే ఘటనపై రెండు రకాల సినిమాలు రానున్నట్లు తెలుస్తోంది. A story that celebrates the accomplishments of The Indian Air Force🇮🇳#2019BalakotStrike @PMOIndia @DefenceMinIndia @IAF_MCC #SanjayLeelaBhansali @itsBhushanKumar @AbhisheKapoor #MahaveerJain, @PragyaKapoor_ @Tseries @gitspictures @SundialEnt @prerna982 pic.twitter.com/A5Oh8xpMyB — BhansaliProductions (@bhansali_produc) December 13, 2019 -
హమ్మయ్య.. నా పనైపోయింది
ప్రకృతి అడ్డొచ్చిందని బెదరలేదు. అంతర్గత విభేదాలు వచ్చాయని ఆగలేదు. నమ్మకంతో పట్టుదలగా ముందుకు వెళ్లి సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. ఇదంతా.. హిందీలో రూపొందుతోన్న ‘కేదార్నాథ్’ మూవీ గురించే. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, సారా అలీఖాన్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘కేదార్నాథ్’. వెదర్ సహకరించకపోవడం వల్ల షూటింగ్ కాస్త ఆలస్యం అయింది. ఈలోపు చిత్రబృందంలో అంతర్గత కలహాలు వచ్చాయన్న కారణాలతో సినిమా ఆగిపోయిందన్నారు బీటౌన్ సినిమా జనాలు. కానీ సడన్‌గా కొత్త రిలీజ్ డేట్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించడంతో సినిమాపై ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయి. తాజాగా ఈ సినిమాలో తన వంతు షూటింగ్‌ను కంప్లీట్ చేశారు సుశాంత్. దీంతో.. హమ్మయ్య..నా పని కంప్లీటైందని ఊపిరి పీల్చుకున్నారట సుశాంత్. ‘కేదార్నాథ్’ సినిమా ఈ ఏడాది నవంబర్ 30న విడుదల కానుంది. -
ఖస్సుమన్న కత్రినా!
రొమాంటిక్ సీన్స్‌లో నటించడం కత్రినా కైఫ్‌కి కొత్త కాదు. అవలీలగా చేసేస్తారు. అయితే ఒకే టేక్‌లో ఓకే అయిపోవాలనుకుంటారు. దర్శకుడు రీటేక్ చేద్దామంటే ఆమెకు అస్సలు నచ్చదట. చేయనని కరాఖండిగా చెప్పేస్తారట. ‘ఫితూర్’ షూటింగ్ లొకేషన్లో అలానే చెప్పారట. ఆదిత్యారాయ్ కపూర్, కత్రినా జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కత్రినా కన్నా ఆదిత్యారాయ్ కపూర్ జూనియర్. దాంతో రొమాంటిక్ సన్నివేశంలో చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిపడ్డారట. సీన్ తీసిన తర్వాత మానిటర్లో చూసి, ‘సరిగ్గా లేదు.. మళ్లీ చేద్దాం’ అని దర్శకుడు అన్నారట. ఏ మాట వింటే కత్రినాకు మంటగా ఉంటుందో అదే వినపడింది. అంతే... అభిషేక్ కపూర్ మీద విరుచుకుపడ్డారని సమాచారం. అభిషేక్ కూడా కత్రినాతో దీటుగా గొడవపడ్డారట. షూటింగ్ ఆగిపోయేలా ఉండడంతో, నిర్మాత సిద్ధార్థ్‌రాయ్ కపూర్ రంగంలోకి దిగి, కత్రినాను రీటేక్‌కు ఒప్పించారట. -
లక్కీ ఛాన్స్!
గాసిప్ ఎనిమిది సంవత్సరాల క్రితం అభిషేక్ కపూర్ డెరైక్షన్‌లో వచ్చిన ‘రాక్ ఆన్’ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది. ఫర్హాన్ అఖ్తర్, ప్రాచీ దేశాయ్‌లకు మంచి పేరు తెచ్చింది. సక్సెస్ అయిన ఊపులో ‘రాక్ ఆన్’కు సీక్వెల్ తీసుకు రావడానికి రెండు మూడుసార్లు ప్రయత్నాలు జరిగాయి కానీ ప్రాజెక్ట్ పట్టాలకెక్కలేదు. ఇప్పుడు మాత్రం నిజంగానే ‘రాక్ ఆన్’కు సీక్వెల్ రాబోతుంది. ‘రాక్ ఆన్’లో నటించిన అర్జున్ రాంపాల్, ఫర్హాన్ అఖ్తర్‌లు సీక్వెల్లోనూ నటించనున్నారు. అయితే ప్రాచీ దేశాయ్ స్థానంలో శ్రద్ధాకపూర్ నటించనుంది అనే వార్తలు వెలువడుతున్నాయి. ఇంతకీ ‘రాక్ ఆన్’ సీక్వెల్లో ప్రాచీకి బదులు శ్రద్ధాకపూర్‌ను ఎందుకు తీసుకుంటున్నట్లు? ప్రాచీతో పోల్చితే శ్రద్ధా సక్సెస్‌లో ఉంది. ఆ సక్సెస్‌ను క్యాష్ చేసుకోవడానికే శ్రద్ధాకపూర్‌ను తీసుకున్నట్లు ఆ నోటా ఈ నోటా వినిపిస్త్తోంది. -
హర్ట్... నాట్ రిటైర్డ్!
చూస్తుంటే అభిషేక్కపూర్ ‘డ్రీమ్’ ప్రాజెక్ట్ ‘ఫితూర్’ క్యూటీ కత్రినాకు ఓ పీడ‘కల’గా మిగిలిపోయేట్టుంది. గత నెలలో ఈ సినిమా సెట్స్‌పై గాయపడిన ఈ స్వీటీ... తాజాగా మరోసారి ‘హర్ట్’ అయింది. చిత్రానికి కీలకమైన హార్స్ రైడింగ్ సన్నివేశంలో అమ్మడు పట్టు తప్పి పడిపోయింది. మెడ, వెన్ను భాగంలో గాయాలయ్యాయి. ఈ అన్ఎక్స్పెక్టెడ్ సీన్‌తో స్పాట్లో ఉన్నవారంతా షాకయ్యారు. అంతలోనే తేరుకున్న కత్రినా... మళ్లీ గుర్రం ఎక్కి స్వారీ చేసింది. ఓ రోజు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినా.. షూటింగ్‌కు ప్యాకప్ చెప్పకుండా తనలోని ప్రొఫెషనలిజాన్ని మరోసారి చూపింది. ఇదిలావుంటే... షూటింగ్‌లతో బిజీగా గడిపేసిన కత్రినా, ఆమె స్టార్ లవర్ రణబీర్ కపూర్ సమ్మర్ హాలిడేస్‌ను పూర్తిస్థాయిలో ఆస్వాదించేందుకు మాల్దీవ్స్ చెక్కేశారన్నది ఓ ఆంగ్ల పత్రిక కథనం! -
రణబీర్‌కు రెడ్ సిగ్నల్!
బాలీవుడ్ ప్రేమికులు రణబీర్‌కపూర్, కత్రినాకైఫ్‌ల మధ్య రెడ్ సిగ్నల్ వేశాడు దర్శకుడు అభిషేక్ కపూర్! ఒకరికొకరుగా తపిస్తున్న వారి కలయికకు బ్రేక్ వేశాడు. కశ్మీర్లో షూటింగ్ జరుపుకోనున్న తన సినిమా ‘ఫితూర్’ సెట్స్ వద్దకు రణబీర్ రాకూడదంటూ కండిషన్ పెట్టాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం ఈ చిన్నది కశ్మీర్ వెళుతోంది. షెడ్యూల్ ప్రకారం పక్కాగా పని ముగించుకోవాలన్న పట్టుదలతో ఉన్న అభిషేక్... ‘దయచేసి మీరు కశ్మీర్‌కు రావద్దు’ అంటూ రణబీర్‌కపూర్‌ను రిక్వెస్ట్ చేశాడని ఓ వెబ్సైట్ కథనం. ఇద్దరూ కలిస్తే... వారి ప్రేమాయణంలో పడి షూటింగ్‌కు బ్రేక్ వస్తుందనేది మనోడి అభిప్రాయమట! హూ...! ఎవడి గోల వాడిదంటే ఇదేనేమో! -
మంచి చిత్రాలకు ఆదరణ
న్యూఢిల్లీ: మంచి చిత్రాలకు ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందని తన కాయ్ పోచే నిరూపించిందని దర్శకుడు అభిషేక్ కపూర్ తెలిపాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో తన తదుపరి చిత్రం ‘ఫితూర్’ షూటింగ్ మొదలవుతుందన్నాడు. ‘కాయ్‌పోచే’ విజయవంతం కావడంతో ప్రస్తుతం అతడు ‘ఫితూర్’ స్క్రిప్ట్ పనిలో పడ్డాడు. ఈ సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ..‘ ప్రముఖ ఆంగ్ల రచయిత చార్లెస్ డికెన్స్ రచించిన ‘ది గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్’ ను ఆధారంగా చేసుకుని ఫితూర్ కథను తయారుచేస్తున్నాను. ఇందులో సుషాంత్ సింగ్ రాజ్‌పుత్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్నారు. నాతో పాటు వారిద్దరూ ఈ సినిమాపై చాలా ఆసక్తిగా ఉన్నారు..’ అని చెప్పాడు. కత్రినా తో అభిషేక్‌కు ఇది మొదటి సినిమా కాగా, సుషాంత్ సింగ్ ఇప్పటికే అభిషేక్ దర్శకత్వం వహించిన ‘కాయ్ పో చే’ సినిమాలో నటించాడు. ‘ఫితూర్ చిత్ర కథకు హీరోహీరోయిన్లుగా సుషాంత్, కత్రినా జంట సరిగ్గా సరిపోతారు. ది గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ కథ పిప్ అనే ఒక అనాధ బాలుడికి సంబంధించింది. అతడు ఎస్టెల్లా అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమె ధనవంతురాలే కాని ఏమాత్రం మానవత్వం ఉండదు..’ అని చెప్పాడు. ‘కాయ్ పోచే’ వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుకు భారతదేశం నుంచి అధికారికంగా ఎంట్రీ పొందింది. తన సినిమా ఆస్కార్ నామినేషన్ గురించి ఎక్కువగా మాట్లాడటానికి అభిషేక్ ఇష్టపడలేదు. ‘ఆస్కార్ ఎంపిక గురించి నాకు ఏమాత్రం అవగాహన లేదు. ప్రేక్షకులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మంచి చిత్రాన్ని వారు ఆదరిస్తారు. కాయ్ పోచేపై పూర్తి విశ్వాసంతో పనిచేశాను. ఆ మేరకు ఆత్మసంతృప్తి పొందాను..’ అని అన్నాడు. అభిషేక్ బాలీవుడ్లో 1996లో ‘ఉఫ్.. ఏ మొహబ్బత్’ అనే సినిమాతో నటుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. 2006లో విడుదలైన ఆర్యన్ సినిమాతో దర్శకుడిగా మారాడు. తనకు డబ్బు ఒక్కడే ముఖ్యం కాదని అతడు స్పష్టం చేశాడు. ‘నాకు ఇష్టమైన పనిని మాత్రమే చేస్తాను.. దాని కోసం ఎంతకాలమైనా ఎదురుచూస్తాను..’ అని అభిషేక్ అంటాడు.