
ఎర్ర తివాచీ చిన్నబోయింది
అందాల తారలు ఎర్ర తివాచీపై క్యాట్‌వాక్ చేస్తుంటే చూడటానికి అదో హాయి. పైగా ఐశ్వర్యా రాయ్ లాంటి సౌందర్య రాశి హంస నడకలు నడిస్తే చూడడానికి రెండు కళ్లూ చాలవు. ముఖ్యంగా ఫ్రాన్స్‌లో జరిగే కేన్స్ చలన చిత్రోత్సవాల్లో ఐష్ చేసే ర్యాంప్ వాక్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఆమె అభిమానులు ఎదురు చూస్తుంటారు. ప్రతి ఏడాది మే నెలలో జరిగే ఈ ఉత్సవాలపై సినీ అభిమానుల దృష్టి ఉంటుంది. పదమూడేళ్లుగా క్రమం తప్పకుండా ఐష్ ఈ వేడుకల్లో మెరుస్తున్నారు. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా ఓ ప్రముఖ సౌందర్య సాధనం తరఫున ఎర్ర తివా చీపై హంస నడకలు నడవడానికి సమాయత్తమయ్యారు. కూతురు ఆరాధ్య, తల్లి బృందా రాయ్‌తో కలిసి ఆమె బుధవారం ముంబయ్ నుంచి ఫ్రాన్స్‌కు ప్రయాణం అయ్యారు. ఈ ప్రయాణం సజావుగా సాగి ఉంటే, శుక్రవారం కేన్స్ చిత్రోత్సవాల్లో ఐష్ ర్యాంప్ వాక్ చేసి ఉండేవారు. కానీ, ఫ్రాన్స్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమ్మె కారణంగా ఐష్ లండన్ దాటలేకపోయారు. ఈ అందాల సుందరి ఆగమనం కోసం ఎదురు చూసిన అభిమానులను ఈ వార్త నిరాశపరిచింది. అందాల సుందరి పాదాలను మోయడానికి సిద్ధంగా ఉన్న ఎర్ర తివాచీ సైతం చిన్నబోయిందంటే అతిశయోక్తి కాదు.
వాస్తవానికి శుక్ర, శనివారాల్లో ఐష్ ర్యాంప్ వాక్ చేయాల్సి ఉంది. కానీ, మొదటి రోజు మిస్సయ్యారు. రెండో రోజు గురించి తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈరోజు కూడా మిస్సయితే అప్పుడు వేరే తేదీల్లో ఐష్‌తో ర్యాంప్ వాక్ చేయించడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. ఈ నెల 14న ప్రారంభమైన ఈ చిత్రోత్సవాలు 25 వరకు సాగుతాయి. ఇది ఇలా ఉంటే.. చిత్రోత్సవాల ప్రారంభం నాడు మల్లికా శెరావత్ ర్యాంప్ వాక్ చేశారు.