
తమిళసినిమా: ఒక కొత్త కాంబినేషన్ సెట్ అయ్యింది. ఆరడుగుల అందగాడు అరవిందస్వామి, రైజింగ్ బ్యూటీ రెజీనాల రేర్ కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం తెరకెక్కబోతోందన్నది తాజా వార్త. స్మార్ట్ హీరో, స్టైలిష్ విలన్, మళ్లీ స్టార్ హీరో ఇలా తనను తాను మార్చుకుంటూ దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు అరవిందస్వామి. తనీఒరవన్ చిత్రంలో ఆయన విలనీయం చూసిన వారు రోజా చిత్ర హీరోనా ఈయన అని ఆశ్చర్యపోయారు. అలా విలన్‌గా మెప్పించిన అరవిందస్వామి భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రంతో మళ్లీ హీరోగా మారిపోయారు. ప్రస్తుతం ఈయన నటించిన చతురంగవేట్టై– 2 చిత్రం తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. తాజాగా మరో చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. అవును ఎన్నమో నడక్కుదు, అచ్చమిండ్రి చిత్రాల ఫేమ్ రాజపాండి దర్శకత్వంలో అరవిందస్వామి హీరోగా నటించనున్నారు. దర్శకుడు చెప్పిన కథ వినగానే చాలా కొత్తగా ఉందని ప్రశంసిస్తూ అందులో నటించడానికి వెంటనే ఓకే చెప్పారట.
ఇకపోతే ఇందులో అరవిందస్వామితో రొమాన్స్ చేయడానికి నటి రెజీనా రెడీ అనేసిందట. ఈమెకు కథ పిచ్చపిచ్చగా నచ్చేయడం, ముఖ్యంగా తన పాత్ర విపరీతంగా ఆకట్టుకోవడంతో నటించడానికి రెడీ అనడంతోపాటు చాలా మంచి పాత్రలో నటించే అవకాశం కల్పించినందుకు దర్శకుడికి థ్యాంక్స్ చెప్పింది. ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. మిస్టర్ చంద్రమౌళి చిత్రంలో అందాలను విచ్చలవిడిగా ఆరబోసేసినా ఆ చిత్రం రెజీనా కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదని తెగ బాధ పడిపోయిందట. అయితే తాజాగా అరవిందస్వామితో జతకట్టే అవకాశం రావడంతో ఫుల్ ఖుషీ అవుతోందని సమాచారం. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం వచ్చే నెలలో సెట్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రం కోసం స్థానిక వడపళినిలోని ఏవీఎం.స్టూడియోలో ఒక బ్రహ్మాండమైన సెట్‌ను వేస్తున్నారని చిత్ర వర్గాలు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment