ఊరికే కామెంట్‌ చేస్తే ఊరుకోం | Renu Desai hits back at a netizen for abusing her | Sakshi
Sakshi News home page

ఊరికే కామెంట్‌ చేస్తే ఊరుకోం

Published Wed, Mar 13 2019 1:18 AM | Last Updated on Wed, Mar 13 2019 1:18 AM

Renu Desai hits back at a netizen for abusing her - Sakshi

‘మీరు బాగుండరు. మీకు సినిమా అవకాశాలు ఎలా వస్తున్నాయి. తాప్సీని సూటిగా అడిగాడో నెటిజన్‌.‘ప్యాంట్‌ వేసుకోవడం మరచిపోయావా’ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ని కామెంట్‌ చేశాడో ఆకతాయి.‘గ్లామరస్‌ రోల్స్‌కి నువ్వు సూట్‌ కావు’ లావణ్యా త్రిపాఠీని హేళన చేశాడో వ్యక్తి...సోషల్‌ మీడియాలో సినిమా స్టార్స్‌ని ఉద్దేశించి ఇలా నెగటివ్‌ పోస్టులు పెట్టడానికి చాలామంది రెడీ అయిపోతుంటారు. వాటికి తారలు దీటైన సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా సమీరా రెడ్డి, రేణూ దేశాయ్, రష్మీ గౌతమ్‌లు తమపై విసిరిన విమర్శలకు‘ఊరికే కామెంట్‌ చేస్తే ఊరుకోం’ అంటూ ఘాటుగా సమాధానాలు విసిరారు. అవేంటోతెలుసుకుందాం.

ఏది పడితే అది అనొచ్చా?
‘‘నేను ఒక రైతు కొడుకుని. రెండు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నాను. మీరందరూ (యాక్టర్స్‌ను ఉద్దేశిస్తూ) రైతుల కోసం ఏం చేస్తున్నారు? ఏమీ లేదు. కొన్ని డబ్బుల కోసం మేకప్‌ వేసుకుని కెమెరా ముందు డ్రామా చేస్తున్నారు’’ అంటూ ఓ అసభ్య పదజాలంతో ఒక నెటిజన్‌ చేసిన కామెంట్‌ను స్క్రీన్‌షాట్‌ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు రేణూ దేశాయ్‌. ఈ పోస్ట్‌ పై ఆమె ఇలా స్పందించారు.  ఈ పోస్ట్‌ కచ్చితంగా చదువుతారని అనుకుంటున్నాను. ఒక సెలబ్రిటీ ఎప్పుడైనా ‘ఎఫ్‌’ (నెటిజన్‌ వాడిన అసభ్య పదజాలం) అనే పదాన్ని సోషల్‌ మీడియాలో ఒక అభిమాని మీద వాడితే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అది ఓ బ్రేకింగ్‌ న్యూస్‌ అవుతుంది. నిర్దయగా చాలా దారుణంగా ఆ సెలబ్రిటీని ట్రోల్‌ చేస్తూ దూషిస్తారు. కానీ అదే పదం... ఒక మామూలు మనిషి ఒక సెలబ్రిటీ మీద వాడితే వాళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు. ఏంటి ఇది? అంటే ఒక సెలబ్రిటీని ఎవరు పడితే వాళ్లు ఏది పడితే అది అనొచ్చు. దూషించొచ్చు. వాటిని ఆ సెలబ్రిటీ భరించాలి. ఎలాంటి భావోద్వేగాలకు గురి కాకూడదు. అంటే మామూలు మనుషులకు మాత్రమే భావాలు, భావోద్వేగాలు ఉంటాయి. సెలబ్రిటీలకు ఉండకూడదా? ప్రతి రోజు మీ సోషల్‌ మీడియాలో ఎవరో ఒకరు ఏదో రకంగా మిమ్మల్ని దూషిస్తూ, ఏవేవో పోస్టులు పెడుతూ ఉంటే వాటిని చదువుతున్నప్పుడల్లా మీకు ఎలా ఉంటుందో ఊహించుకోండి. అది కూడా రైతులకు ఏదో రకంగా సాయపడాలని నేను చేస్తున్న ప్రయత్నాన్ని విమర్శిస్తూ నన్ను దూషించడం మరీ దారుణం. నేను డబ్బు కోసం చేస్తున్నానా? పేరు కోసం చేస్తున్నానా లేదా ఇంకేదైనా కారణం కోసం చేస్తున్నానా? అనేది ముఖ్యం కాదు. దాని వల్ల మన రైతుల సమస్యలను ఎంత వరకు బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతున్నాను అన్నది ముఖ్యం. ఏదో ఒక రోజు ఈ ఊరు పేరు బయట పెట్టకుండా ఈ ట్రోల్స్‌ చేసేవారంతా తప్పు తెలుసుకుని, వారి శక్తి సామర్థ్యాలను ఇలా అనవసరంగా సెలబ్రిటీలను దూషించడం కోసం కాకుండా ఏదైనా మంచి పనికోసం వాడితే మంచిది.

ఆలోచనా ధోరణి మారాలి
ఇటీవల సమీరా రెడ్డి రెండోసారి ఓ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలియజేస్తూ తాను ప్రెగ్నెంట్‌గా ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. చాలామంది ఆమెకు అభినందనలు కూడా తెలిపారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కొందరు విమర్శించారు ‘‘సమీరా.. బాగా లావైపోయావు. బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ కూడా కరీనా కపూర్‌ ఇంకా బాగానే ఉంది’’ అన్నది ఆ విమర్శల సారాంశం. అంటే.. మొదటి బిడ్డ పుట్టాక సమీరా బరువు తగ్గకుండా అలానే ఉందన్నది వారి ఉద్దేశం కావొచ్చు. ఈ విషయం గురించి సమీరా స్పందించారు. ‘‘ఒకరికి జన్మనిచ్చిన తర్వాత కూడా కరీనా కపూర్‌లా హాట్‌గా ఉండేవారు ఉన్నారు. జన్మనిచ్చిన తర్వాత శరీరాకృతిని మామూలుగా మార్చుకోవడానికి సమయం తీసుకునే నాలాంటి వారు ఉన్నారు. నువ్వు (కామెంట్‌ చేసినవారిని ఉద్దేశించి) పుట్టినప్పుడు కూడా మీ అమ్మ హాట్‌గా ఉందా? అని అడగాలనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ అనేది ఒక సహజమైన ప్రక్రియ. ఒక అందమైన అనుభూతి. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బరువు తగ్గడానికి కాస్త టైమ్‌ పట్టొచ్చు. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నాను. రెండో డెలివరీ తర్వాత నా శరీరాకృతి మారడానికి మరింత టైమ్‌ పట్టొచ్చు. అంతమాత్రాన విమర్శిండమేనా? చేస్తున్న పని సరైనదేనా? అనిట్రోల్స్‌ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మీకు ఏం కావాలి? ఒక మహిళగా ఒక బిడ్డకి జన్మనివ్వగల సూపర్‌ పవర్‌ నా దగ్గర ఉంది. తొలిసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు చాలా సిగ్గుగా ఫీల్‌ అయ్యేదాన్ని. చాలా ఆలోచనలు నా మైండ్‌లో ఉండేవి. కానీ ఇప్పుడు కష్టంగా అనిపిస్తోంది. నా ఫస్ట్‌ ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా కవర్‌ చేసుకునేదాన్ని. ఇప్పుడు అలా చేయడం లేదు. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా హాట్‌గానే ఉన్నాను. ఇక్కడ గమనించాల్సింది ఒక్కటే. మన ఆలోచనాధోరణి, ఒక విషయాన్ని నెగటివ్‌గా చూసే దృష్టి కోణం మారాలి.

ఆ ప్రయత్నాన్ని మానుకో!
పీఆర్‌ మేనేజ్‌మెంట్‌ ట్వీటర్‌ యూజర్‌నేమ్‌తో నటి, యాంకర్‌ రష్మీ గౌతమ్‌ను ఒక ఆకతాయి ట్రోల్‌ చేశాడు. ‘‘మీతో ఓ యాడ్‌ ప్లాన్‌ చేశాం. మీ నాన్నగారి నంబర్‌ మిస్సయ్యాను. ఇస్తారా?’’ అని ఆ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. దీన్ని రష్మీ గౌతమ్‌ ట్యాగ్‌ చేస్తూ– ‘‘నా 12ఏళ్ల వయసులో మా నాన్నగారు మరణించారు. మా నాన్నగారి నంబర్‌ నీ దగ్గర ఉండదు. పీఆర్‌ మేనేజ్‌మెంట్‌ అనే పేరుతో నన్ను ఫూల్‌ని చేయాలనుకునే నీ ప్రయత్నాన్ని ముందు మానుకో. అమ్మాయిలను ఇబ్బందిపెట్టడానికి ఇదొక కొత్తదారిలా అనిపిస్తోంది. మీలాంటి వారు ఇండస్ట్రీకి చెడ్డపేరు తీసుకొస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. రష్మి తండ్రి నంబర్‌ను అడిగిన ట్వీట్‌ను సదరు నెటిజన్‌ ఆ తర్వాత డిలీట్‌ చేశారు. నెటిజన్లు ట్రోల్‌ చేసినప్పుడు సైలెంట్‌గా ఉండకుండా ఇలా ధైర్యంగా దీటైన బదులు చెప్పారు అంటూ కొందరు నెటిజన్లు అభినందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement