ధనుష్‌తో జత కట్టాలని ఆశ | Ritika Singh hope with Dhanush | Sakshi
Sakshi News home page

ధనుష్‌తో జత కట్టాలని ఆశ

Published Tue, Sep 20 2016 1:48 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

ధనుష్‌తో జత కట్టాలని ఆశ

ధనుష్‌తో జత కట్టాలని ఆశ

నటుడు ధనుష్‌తో కలిసి నటించాలని ఆశగా ఉందని అంటున్నారు నటి రితిక సింగ్. ముంబైకి చెందిన ఈ బాక్సింగ్ భామ రాను, రాను అంటూనే సినీ రంగ ప్రవేశం చేసి ఇరుదుచుట్రు (చివరి రౌండ్) అంటూ తొలి చిత్రంతోనే పెద్ద విజయాన్ని పొందడంతో పాటు జాతీయ అవార్డును అందుకున్నారు. ఇక తమిళంతో పాటు తెలుగులోనూ అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతికి జంటగా ఆండవన్ కట్టళై చిత్రంలో నటిస్తున్నారు. కాక్కాముట్టై చిత్రం ఫేమ్ మణికంఠన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది.
 
  ఈ సందర్భంగా రితిక సింగ్‌ను పలకరిస్తే బోలెడన్ని కబుర్లు చెప్పుకొచ్చారు. అవేమిటో ఆ సుందరి మాటల్లోనే...ఆండవన్ కట్టళై చిత్రంలో మహిళా రిపోర్టర్‌గా నటిస్తున్నాను. ఈ పాత్ర కోసం పలు ఛానళ్లను చూసి రిపోర్టర్ల నడవడికలను క్షుణ్ణంగా గమనించాను. ఇప్పుడు నాకు ప్రశ్నలను అడగడం తెలిసింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన సింధును ఇంటర్వ్యూ చేయాలన్న కోరిక కలుగుతోంది. అయితే ఇంకా తమిళ భాష మాట్లాడటం రాలేదు. ఇతరులు మాట్లాడింది అర్థం చేసుకోగలుగుతున్నాను. షూటింగ్‌లో నాకొక శిక్షకుడు ఉన్నారు.
 
  త్వరలోనే తమిళ భాషను నేర్చుకుంటాను. తొలి చిత్రంతోనే జాతీయ అవార్డు లభించడం అదృష్టంగానే భావిస్తున్నాను. ఇకపై ఎలాంటి పాత్ర అయినా బాగా నటించాలన్న బాధ్యత పెరిగింది. తమిళంలో నటుడు ధనుష్ అంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి నటించాలని ఆశగా ఉంది. జ్యోతిక నా అభిమాన నటి. ఆమె నటన నాకు బాగా నచ్చుతుంది.
 
  తమిళ ప్రేక్షకులంటే చాలా గౌరవం. నన్ను ఒక్క చిత్రంతోనే ఎంతగానో అభినందిస్తున్నారు. ముఖంపై గాయాలయితే నటనకు ఇబ్బంది అవుతుందని బాక్సింగ్ క్రీడా పోటీల్లో పాల్గొనడం లేదు. ఆండవన్ కట్టళై చిత్రంలో నటించడానికి ఆ చిత్ర హీరో విజయ్ సేతుపతి చాలా సహకరించారు. తదుపరి పీ.వాసు దర్శకత్వంలో లారెన్స్‌కు జంటగా నటిస్తున్నాను. తెలుగులో వెంకటేష్‌తో కలిసి నటిస్తున్నాను అని ముచ్చటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement