ఆ ఘనత నాదే
ఒకే ఏడాది మూడు సంచలన విజయాలను సాధించిన ఘనత నాదేనని సగౌరవంగా చేప్పుకోగలను అంటున్నారు జయంను తన పేరులోనే ఇముడ్చుకున్న నటుడు జయంరవి. ఆయన ఈ ఏడాది నటించిన రోమియో జూలియట్, తనీఒరువన్, తాజాగా విడుదలైన భూలోకం చిత్రాలు విశేష ప్రేక్షకాదరణ పొందిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆ చిత్రాల దర్శకులు,తన కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశంలో తన సంతోషాన్ని పంచుకున్నారు. జయంరవి మాట్లాడుతూ 2015లో తను నటించిన నాలుగు చిత్రాలు విడుదలవ్వగా అందులో మూడు చిత్రాలు ఘన విజయం సాధించాయన్నారు.
ఈ ఏడాది మొదట్లో విడుదలైన రోమియో జూలియట్ తొలి విజయానికి నాంది పలికిందన్నారు.ఈ తరువాత వచ్చిన సకలకళావల్లవన్(అప్పాటక్కర్)ఆశించిన విజయాన్ని సాధించక పోయినా అదీ తన కేరీర్‌లో మంచి చిత్రమేనన్నారు.ఆ చిత్రానికి తన శ్రమ,కృషి పూర్తిగా ఉన్నాయని చెప్పారు. ఇక తన అన్నయ్య మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందిన తనీఒరువన్ చిత్రం విజయం గురించి మీకే తెలుసు. తను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అన్నారు. తాజాగా విడుదలైన భూలోకం పలు అవరోదాలను ఎదుర్కొని ఇటీవల తెరపైకి విశేష ప్రజాభిమానాన్ని చూరగొనడం సంతోషంగా ఉందన్నారు. 2016 లోనూ ఇలాంటి విజయాల పరంపరనే కొనసాగుతుందనే నమ్మకం ఉందన్నారు.
12 రకాల జీవితాల్ని చవి చూశాం
దర్శకుడు, జయంరవి సోదరుడు మోహన్‌రాజా మాట్లాడుతూ తమ్ముడు రవి, తానూ చిత్ర రంగప్రవేశం చేసి పుష్కరకాలం అయ్యిందన్నారు. ఈ 12 ఏళ్లలో 12 రకాల జీవితాలను అనుభవించామని అన్నారు. తమ్ముడు విజయాలను చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు.రవికి తాను ఇచ్చే సలహా ఒక్కటే నీ వెనుక తామంతా ఉన్నామని ఈ విజయపరంపరను కొనసాగించు. అహాన్ని మాత్రం పెంచుకోవద్దు అని అన్నారు. తన తండ్రి 60 ఏళ్ల అనుభవం తమ వెనుక ఉందని అన్నారు.
సింహాసనం వేసి కిరీటం తొడిగారు
కొడుకుల విజయాలకు ఉప్పొంగుతున్న ఆనందం మధ్య సీనియర్ ఎడిటర్, నిర్మాత ఎడిటర్ మోహన్ మాట్లాడుతూ తన బిడ్డలకు తానెప్పుడూ ఒకటే చెబుతుండేవాడినన్నారు. ఏ పని చేసినా దాన్ని పరిపూర్ణంగా చేయమని అనే వాడినన్నారు. తన సలహాను పాటించి ఇవాళ ఇంతవాళ్లయిన వారిని చూసి గర్వపడుతున్నానన్నారు. తనకు పెద్ద కొడుకు మోహన్‌రాజా సింహాసనం ఏర్పాటు చేస్తే చిన్న కొడుకు జయంరవి కిరీటాన్ని తొడిగాడని ఆనంద బాష్పాలతో అన్నారు. జయంరవి కుటుంబ సభ్యులతో పాటు దర్శకుడు లక్ష్మణ్,కల్యాణ్‌క్రిష్ణన్ పాల్గొన్నారు.