కమల్, సూర్యల బాటలో పయనిస్తా | root in kamal, surya | Sakshi
Sakshi News home page

కమల్, సూర్యల బాటలో పయనిస్తా

Published Sat, Jun 14 2014 1:03 AM | Last Updated on Wed, Aug 1 2018 2:35 PM

కమల్, సూర్యల బాటలో పయనిస్తా - Sakshi

కమల్, సూర్యల బాటలో పయనిస్తా

కమల్‌హాసన్, సూర్యల బాటలో పయనిస్తానని యువ సంగీత దర్శకుడు, వర్దమాన నటుడు జీవీ ప్రకాష్‌కుమార్ అన్నారు. అతిపిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా పరిచయమైన ఈయన తనకు 25 ఏళ్లు వచ్చే సరికే 25 చిత్రాలకు సంగీతాన్ని అందించి చరిత్రకెక్కారు. ప్రస్తుతం సంగీత దర్శకుడిగా బిజీగా ఉంటూనే నిర్మాతగా మారి హీరోగానూ అవతారమెత్తిన జీవీకి అభిమానగణం ఏర్పడడంలో ఆశ్చర్యమేమీ ఉండదు. ఈయన హీరోగా నటించిన పెన్సిల్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

కాగా శుక్రవారం జీవీ ప్రకాష్‌కుమార్ తన పుట్టిన రోజు వేడుకను అభిమానుల మధ్య చెన్నైలో జరుపుకున్నారు. ఈ వేదిక జీవీ అభిమాన సంఘం ఆవిర్భావ వేడుకగా కూడా మారింది. అభిమానులు పది కిలోల కేకును ఏర్పాటు చేసి ఆయన పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు. జీవీకి పూలకిరీటాన్ని, వెండి కత్తిని ధరింపచేసి ఆనందించారు. అలాగే చెన్నై తిరువాన్మయూర్‌లోని కేక్కుం కరంగళ్ ఆశ్రమంలోని బాలలకు, ఓటేరిలోని ఆషా నివాస్ బాయ్స్ షల్టర్ హోమ్‌లోని పిల్లలకు అన్నదానం చేశారు.
 
తప్పుడు అభిప్రాయం ఉంది
ఫ్యాన్ క్లబ్ ఆ విర్భావం గురించి జీవీ ప్రకాష్ కుమార్ వెల్లడిస్తూ తన అభిమానుల్లో అధిక శాతం యువకులేనన్నారు. వారంతా ఫేస్‌బుక్, ట్విట్టర్ అంటూ కాలం గడిపేస్తున్నారన్నారు. అలాంటి వారినందర్నీ ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ ఫ్యాన్ క్లబ్ ప్రారంభించడానికి కారణమన్నారు. భారతదేశంలో అత్యంత శక్తివంతమైనది యువశక్తి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. చిన్న వయసులోనే తనకింత పేరుప్రఖ్యాతులను ఆర్జించిపెట్టిన తమిళ ప్రజలకు తాను ఏదైనా చెయ్యాలనుకుంటున్నట్లు తెలిపారు. అభిమాన సంఘాలంటే కొంత తప్పుడు అభిప్రాయం ఉందన్నారు. అయితే మనల్ని అభిమానిస్తున్న యువత మానవత్వంతో మంచి మంచి కార్యాలను కచ్చితంగా నిర్వహించవచ్చన్నారు. కమల్‌హాసన్, సూర్యల అభిమాన సంఘాలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. తాను వారి బాటలో అడుగులు వేయడానికి సిద్ధమైనట్లు జీవీ ప్రకాష్ కుమార్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement