
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ నటి, గాయని మిసా షఫీపై గాయకుడు అలీ జఫర్ రూ 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. అలీ జఫర్ తనను లైంగికంగా వేధించాడని గతంలో మిష ఆరోపించడంపై అలీ జఫర్ లాహోర్ జిల్లా కోర్టులో కేసు వేశారు. తన ప్రతిష్టను మిసా ఆరోపణలు తీవ్రంగా దెబ్బతీశాయని, తన గుడ్‌విల్‌ను మసకబార్చేలా ఉండటంతో పాటు జీవనోపాధిని దెబ్బతీసేలా ఆమె ఆరోపణలు చేశారని అలీ ఆమెకు పంపిన నోటీసులో పేర్కొన్నారు. తనను మానసికంగా వేధించినందుకు రూ 2 కోట్లు, కాంటాక్టులు కోల్పోయినందుకు రూ 8 కోట్లు, ప్రతిష్ట దెబ్బతీసినందుకు రూ 50 కోట్లు, వ్యాపార అవకాశాలు నష్టపోయినందుకు రూ 40 కోట్ల చొప్పున చెల్లించాలని నోటీసులో అలీ కోరారు.
అలీ రెండు సందర్భాల్లో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని మీసా ఓ ఇంటర్వ్యూలో ఆరోపించిన సంగతి తెలిసిందే. తొలిసారి అలీ తన పట్ల అమర్యాదకరంగా వ్యవహరించిన సందర్భంలో తాను ఆ విషయం తేలిగ్గా తీసుకున్నానని, తామిద్దరం సెలబ్రిటీలు కావడంతో అతడిపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని తన భర్తకు సూచించానని చెప్పారు. మరో సందర్భంలోనూ అలీ ఇలాగే వ్యవహరించారని ఆరోపించారు. అయితే మీసా ఆరోపణలను అలీ తోసిపుచ్చారు. న్యాయస్ధానాల్లోనే ఆమెతో తేల్చుకుంటానని మీసాపై ప్రత్యారోపణలు చేయడం తనకు ఇష్టం లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment