
‘ఆర్‌ఎక్స్–100 ’ ఫేమ్ కార్తికేయ హీరోగా జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్ టెలీ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ప్రారంభమైంది. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకుడు. ఈ చిత్రం ద్వారా అర్జున్ మొదటిసారిగా మెగా ఫోన్ పట్టనున్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినిమా స్క్రిప్ట్‌ను హీరో, దర్శకుడు, నిర్మాతలకు అందచేశారు. అగ్ర దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వంతో పాటు హీరోపై క్లాప్ నిచ్చారు. నటులు అలీ, ప్రవీణా కడియాల కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ‘నేను ఏ సినిమా ఓపెనింగ్‌లకు వెళ్లను. అటువంటిది ఈ చిత్ర నిర్మాతలు ఎంతో కష్టపడి ఇంతదూరం ప్రయాణం చేశారు. వారి ప్రయాణంలోని మొదటి సినిమా ఓపెనింగ్‌కు వచ్చి వాళ్లను మనసారా ఆశీర్వదించటం నా బాధ్యత అనిపించింది. వారితో పాటు మరో నిర్మాత తిరుమల్ రెడ్డి, దర్శకుడు అర్జున్ జంధ్యాల లకు అల్ ది బెస్ట్’ అన్నారు.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘నా దగ్గర పన్నెండు సంవత్సరాలుగా నాతో పాటు అసోసియేట్‌గా ప్రయాణం చేసిన అర్జున్ నాకు తమ్ముడు లాంటివాడు. టాలెంట్, టైమింగ్ ఉన్నవాడతను. అలాగే ఈ నిర్మాతలు నాకు మొదటినుండి మంచి మిత్రులు. హీరోకి ఈ చిత్రం ద్వారా మంచి పేరు వస్తుందని కచ్చితంగా చెప్పగలను’ అన్నారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ ‘‘ఆర్ ఎక్స్100’ చిత్రం విడుదల తర్వాత నేను చాలా కథలు విన్నాను. నేను విన్న అన్ని కథల్లోకి బెస్ట్ కథ ఇది. అందుకే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడేప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత డివివి. దానయ్య, మిరియాల రవీంధర్ రెడ్డి, ప్రవీణ్, నటులు హేమా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment