![వాటిని ఎందుకు నిషేధించాలి?](/styles/webp/s3/article_images/2017/09/3/71459791204_625x300.jpg.webp?itok=DRO2fom7)
వాటిని ఎందుకు నిషేధించాలి?
‘‘నేరుగా తెలుగు సినిమా చేయడం కన్నా, వేరే భాషలోని సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేయడం చాలా కష్టం. డబ్బింగ్ చాలా గొప్ప ప్రక్రియ. శివాజీ గణేశన్ లాంటి మహానటులు తెలుగులో దశరథరామయ్య, కె.వి.ఎస్. శర్మ, జగ్గయ్య లాంటి వారి గొంతు ద్వారానే తెలుగువారికి తెలిశారు. ఈ కళను చిన్నచూపు చూడకండి’’ అని ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు - డబ్బింగ్ కళాకారుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ‘తెలుగు సినిమాల్లో డబ్బింగ్ పాటలు’ పేరిట డాక్టర్ పైడిపాల రచించిన పరిశోధనా గ్రంథాన్ని ఆదివారం నాడు హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పెద్ద నటులు నటించిన పెద్ద సినిమాల కన్నా చిన్న నటులు చేసిన చిన్న డబ్బింగ్ సినిమాలు బాగా ఆడడాన్ని ఎస్పీబీ ప్రస్తావించారు. ‘డబ్బింగ్ సినిమాల్ని నిషేధించాలనే వాదన సినీ పరిశ్రమలో కొందరు పెద్దలు తరచూ అంటున్నారు. మనకు చేతనైతే అంతకన్నా మంచి సినిమాలు తీయాలి కానీ, బాగున్న సినిమాల్ని ఎందుకు నిషేధించాలి?’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. గాయకుడిగా మొదలైన తాను ప్రముఖ సంగీత దర్శకుడు - డబ్బింగ్ కళాకారుడైన చక్రవర్తి బలవంతంతో ‘మన్మథలీల’ సినిమాతో అనుకోకుండా డబ్బింగ్ కళాకారుడినైన సంగతిని ఎస్పీబీ గుర్తు చేసుకున్నారు. కమలహాసన్ ‘దశావతారం’ తెలుగు రూపంలో 8 పాత్రలకు డబ్బింగ్ చెప్పిన క్లిష్టమైన అనుభవాన్ని అందరితో పంచుకున్నారు. ‘‘ఫిల్మ్ మీద ఒక భాషలో ఉన్న సౌండ్ ట్రాక్‌ను తొలగించి, వేరే భాష డైలాగ్ పెట్టాలనే ఆలోచన కొన్ని దశాబ్దాల క్రితం ఎవరికి వచ్చిందో కానీ, వాళ్ళకు జోహార్. పరభాషా చిత్రాల్ని మన తెలుగు నుడికారంలోకి తెచ్చే రచయితలే ఆ డబ్బింగ్ చిత్రాల విజయానికి ప్రధానకారకులు.
తెలుగులోకి సినిమాను డబ్బింగ్ చేసే ప్రక్రియకు ఆద్యుడైన రచయిత శ్రీశ్రీ నుంచి అనిసెట్టి, రాజశ్రీ, ఇవాళ్టి శ్రీరామకృష్ణ, వెన్నెలకంటి దాకా ఈ శాఖను ముందుకు తీసుకెళ్ళిన మహానుభావులందరికీ వందనాలు’’ అని ఎస్పీబీ వ్యాఖ్యానించారు. రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ, తెలుగులో డబ్బింగ్ పాటలపై తొలిసారిగా ఇంత ప్రామాణిక రచన చేసిన పైడిపాలను అభినందించారు. ‘‘డబ్బింగ్ సినిమాకు రైటరే డెరైక్టర్’’ అని స్పష్టం చేస్తూ, శ్రీశ్రీ, ఆరుద్ర, రాజశ్రీ మొదలు కమలహాసన్ దాకా డబ్బింగ్ ప్రక్రియలో ఎదురైన తమాషా అనుభవాల్ని అందరితో పంచుకున్నారు. శాంతా వసంతా ట్రస్ట్ పక్షాన కె. వరప్రసాదరెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, పుస్తక రచయిత పైడిపాల, ప్రముఖ వైద్యులు డాక్టర్ గురవారెడ్డి, పుస్తక ప్రచురణకర్త - ‘మనసు ఫౌండేషన్’ వ్యవస్థాపకులు మన్నం వెంకట రాయుడు అతిథులుగా పాల్గొన్నారు. ‘పద్మశ్రీ’ డాక్టర్ గోపీచంద్, సినీ రచయితలు రావి కొండలరావు, గురుచరణ్, భారతీబాబు, దాము (బాలాజీ) తదితరులు పెద్ద సంఖ్యలో ఈ సభకు హాజరవడం విశేషం.