న్యూఢిల్లీ : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరో పురస్కారం అందుకోనున్నారు. చలన చిత్ర రంగంలో విశేష కృషి చేసినందుకు జీవితకాల సాఫల్యత కొరకు సెంటినరీ అవార్డుతో ఆయనను కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది. గోవాలో జరుగనున్న 47వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్(ఐఎఫ్ఎఫ్ఐ-2016)లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సెంటినరీ అవార్డు ప్రదానం చేయనున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మంగళవారమిక్కడ తెలిపారు.
గత అయిదు దశాబ్దాలుగా తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీ, మలయాళం చలన చిత్ర పరిశ్రమలకు ఎస్పీ బాలు తన గాత్ర మాధుర్యంతో ఎనలేని సేవలు అందించారని ఆయన ప్రశంసించారు. ఎస్పీ బాలు వివిధ భాషల్లో సుమారు 40వేలకుపైగా పాటలు పడి సంగీతాభిమానులను అలరించారన్నారు. కాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరుసార్లు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఆయన సేవలకుగాను పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు వరించాయి. 47వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్..ఈ నెల 20 నుంచి 28 వరకూ గోవాలో జరుగనున్నాయి.