
సాక్షి, సినిమా : కొత్త కొత్త నటులను ప్రోత్సహించటంలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఎప్పుడూ ముందుంటాడు. లగాన్ దగ్గరి నుంచి త్వరలో రిలీజ్ కాబోతున్న సీక్రెట్ సూపర్ స్టార్(అమీర్ నిర్మాత) దాకా పరిశీలిస్తే ఈ విషయాన్ని గమనించవచ్చు. అయితే త్వరలో మరో ఫేమస్ సెలబ్రిటీ కూతురిని కూడా అమీర్ పరిచయం చేయబోతున్నాడని వినికిడి.
లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా త్వరలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం. ఈ మేరకు ఓ ప్రముఖ బాలీవుడ్ మాగ్జైన్ ఓ కథనం కూడా ప్రచురించింది. తనకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉందని సారా సచిన్‌తో చెప్పగా, ఆయన అందుకు సానుకూలంగా స్పందించినట్లు దాని సారాంశం. అయితే సారా లాంఛింగ్ కు అమీర్ ఖాన్ అయితేనే కరెక్టన్న భావనలో సచిన్ ఉన్నాడంట. దీంతో ఈ మేర ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.
రణ్‌బీర్ కపూర్ లేదా రణ్‌వీర్ సింగ్‌లలో ఎవరో ఒకరిని హీరోగా పెట్టి అమీర్ నిర్మాణంలో ఆ చిత్రం తెరకెక్కే అవకాశం ఉంది. ఇప్పటికే సచిన్ వారసుడు అర్జున్ క్రికెట్‌లో రాణిస్తుండగా.. 19 ఏళ్ల సారా సినిమాల్లోకి వస్తుందన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది.