దేవదాసు, దేశముదురు తరహాలో...
పోలికలు చూస్తే... పెద్ద మేనమామ చిరంజీవివి. స్టిల్స్‌లో కనిపిస్తున్న ఫైర్ చూస్తే.. చిన్న మేనమామ పవన్‌కల్యాణ్‌ది. ఓవరాల్‌గా స్టార్ హీరోకి కావాల్సినంత సరంజామానంతా మూటకట్టుకొని తెరమీదకొచ్చేస్తున్న మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. ఆయన్ను హీరోగా పరిచయం చేస్తూ బొమ్మరిల్లువారి పతాకంపై వైవీయస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రేయ్’. చిత్రీకరణ పూర్తి చేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయనున్నారు.
వైవీయస్ చౌదరి మాట్లాడుతూ -‘‘ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్ మరియు ఫాస్ట్ ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి.
చక్కగా ఆకట్టుకుంటున్నాయి కూడా. కానీ ‘దేవదాసు’, ‘దేశముదురు’ తరహాలో భారీస్థాయి మాస్ యూత్ లవ్‌స్టోరీలు రావడం లేదు. ఆ లోటుని తీర్చే విధంగా, అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ‘రేయ్’ ఉంటుంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్ధం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలోనూ, ద్వితీయార్ధం అమెరికా సంస్కృతి నేపథ్యంలోనూ ఉంటుంది. ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండీస్‌లలో కొంత భాగం, హైదరాబాద్‌లో అత్యధిక భాగం చిత్రీకరణ జరిపాం.
మొదటి సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడన్న నమ్మకం నాకుంది. అలాగే సయ్యామి ఖేర్ తన బ్యూటిఫుల్ ప్రెజెన్స్‌తో యూత్‌ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందనడంలో నాకెటువంటి సందేహం లేదు. వాళ్లతోపాటు నరేష్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, తనికెళ్ళ భరణి, వేణుమాధవ్, రఘుబాబు, హేమలాంటి హేమాహేమీలంతా పోటా పోటీగా నవ్వులు పండించారు. ఇక పాటలైతే సందర్భోచితంగా నాదైన గ్రాండియర్ శైలిలో ఆకట్టుకుంటాయి’’ అని తెలిపారు.