చెన్నై : ఈ కాలంలో మాటకు విలువేలేదని చెప్పవచ్చు. అంతా కృత్రిమం, అవకాశవాదమే. ఈ రోజు సరే అన్న వారు రేపు సారీ అంటున్నారు. సినిమా వాళ్లు ఇందుకు అతీతం కాదు. నటి సాయిపల్లవి ఈ కోవకు చెందినదేనా అనే అనుమానాన్ని ఒక యువ దర్శకుడు వ్యక్తం చేస్తున్నాడు. సాయిపల్లవిని కోలీవుడ్‌కు తీసుకురావడానికి ముందు చాలా మంది దర్శకులు ప్రయత్నించారు. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం కూడా సాయిపల్లవిని తన చిత్రంలో నటింపజేయడానికి ప్రయత్నించి విఫలం అయ్యారనే టాక్ అప్పట్లో ప్రచారం అయ్యింది. కాగా ఎట్టకేలకు దర్శకుడు విజయ్ ఆమెను దయా చిత్రంతో కోలీవుడ్‌కు తీసుకొచ్చారు. అయితే ఆ చిత్రం ఆమెను పూర్తిగా నిరాశ పరచింది. అంతే కాదు ఆ తరువాత ధనుష్‌తో రొమాన్స్ చేసిన మారి–2, సూర్య సరసన నటించిన ఎన్‌జీకే చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి, దీంతో అక్కడ సాయిపల్లవి దుకాణం బంద్ అన్నంతగా మారింది. దీంతో తెలుగు, మాతృభాష మలయాళంలోనే దృష్టి పెట్టింది. అలాంటి ఈ అమ్మడు రామకృష్ణన్ అనే యువ దర్శకుడి చిత్రంలో నటించడానికి సాయిపల్లవి మాట ఇచ్చిందట. దర్శకుడు చేరన్ శిష్యుడైన రామకృష్ణన్ సహాయ దర్శకుడిగా ఉన్న సమయంలోనే హీరోగా అవకాశం రావడంతో కుంకుమపూవే కొంజుం పురావే చిత్రంలో నటించాడు. అలా కొన్నిచిత్రాల్లో నటించిన ఇతను ఇటీవల అవకాశాలు లేక ఖాళీగా ఉన్నాడు.
అయితే తాజాగా దర్శకుడిగా చిత్రం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు అందులో నటి సాయిపల్లవి నటించడానికి అంగీకరించినట్లు చెప్పుచొచ్చాడు. దీని గురించి రామకృష్ణన్ తెలుపుతూ.. సాయిపల్లవిని కలిసి కథ వినిపించినట్లూ, కథ విన్న ఆమె ఎన్నాళ్ల నుంచి ఈ కథను తయారు చేస్తున్నారు అని ఆశ్చర్యపోయిందని చెప్పారు. కథ నచ్చిందని, తాను ఈ చిత్రంలో కచ్చితంగా నటిస్తానని చెప్పిందని అన్నారు. ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థనే తనును నటి సాయిపల్లవికి కథ చెప్పమని పంపించిందని దర్శకుడు తెలిపాడు. అయితే కథ బాగుంది, నటిస్తానని చెప్పిన సాయిపల్లవి ఆ తరువాత బిజీ కారణంగా తమ చిత్రానికి కాల్‌షీట్స్ కేటాయించలేదని చెప్పారు. కాగా ఒకవేళ తన కథ సాయిపల్లవికి నచ్చలేదా నిజంగానే బిజీ కారణంగా కాల్‌షీట్స్ ఇవ్వలేకపోతోందా అన్న సందేహం తనకు కలుగుతోందని దర్శకుడు రామకృష్ణన్ అంటున్నాడు. దీనికి సాయిపల్లవే బదులు చెప్పాలి. ఎందుకంటే ఈ అమ్మడికి కోలీవుడ్ అచ్చిరాలేదు. పైగా ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేసేశారు. ఇలాంటి పరిస్థితుల్లో యువ దర్శకుడిని నమ్మి మరోసారి కోలీవుడ్‌కు వచ్చే సాహసం చేస్తుందా తన మాట నిలబెట్టుకుంటుందా? అన్నది వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment