వారిద్దరితో కలిసి పనిచేయాలనుంది : పూరి జగన్నాథ్
‘‘ఓ కొత్త కథ రాయాలని ప్రతి రచయితకూ ఉంటుంది. అలా కొత్తగా ఆలోచించి, కేవలం రెండు పాత్రలతో నేను రాసుకున్న కథ ‘రోమియో’. సినిమా విడుదలైనప్పట్నుంచీ ఈ కథను అభినందిస్తూ చాలా ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది. తక్కువ బడ్జెట్‌లో విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని మలిచాడు గోపీ గణేశ్. ఈ సినిమా విషయంలో ప్రత్యేకంగా అభినందించాల్సిన వ్యక్తులు కెమెరామేన్ పీజీ విందా, సంగీత దర్శకుడు సునీల్‌కశ్యప్. వీరిద్దరితో కలిసి పనిచేయాలనుంది’’ అని పూరి జగన్నాథ్ అన్నారు.
ఆయన కథతో రూపొందిన చిత్రం ‘రోమియో’. సాయిరామ్ శంకర్ కథానాయకునిగా గోపీ గణేశ్ దర్శకత్వంలో ‘టచ్ స్టోన్’ దొరైస్వామి నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విజయోత్సవ సభ హైదరాబాద్‌లో జరిగింది. తమ ప్రయత్నం సఫలమైనందుకు ఆనందంగా ఉందని గోపీగణేశ్ పేర్కొన్నారు’’ రోజురోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయని సాయిరామ్ శంకర్ చెప్పారు. తుఫాన్ వల్ల గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రజలు చాలా నష్టపోయారని, ఈ శుక్రవారం వచ్చే వసూళ్లను తుఫాను బాధితులకు అందిస్తామని చిత్ర సమర్పకుడు ‘మధుర’ శ్రీధర్ చెప్పారు. చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.