
నా పాటను మికాసింగ్ దొంగిలించాడు!
ముంబై:తన పాటను సింగర్ మికాసింగ్ దొంగిలించాడని అంటున్నాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. గాయకుడైన మికా సింగ్ పాటను అపహరించడం ఏంటా అనుకుంటున్నారా?, ఇటీవల విడుదల చేసిన 'ఆజ్ కీ పార్టీ'అనే పాటను సల్మాన్ పాడదామనుకున్నాడట. అయితే ఈలోపు ఆ పాటను మికాసింగ్ పాడేసి.. తన కోరికను నెరవేరకుండా చేశాడు. ఆ పాటను పాడటానికి చాలా సార్లు ప్రయత్నించా. ఆ క్రమంలోనే పాట లెంగ్త్ ను కూడా తగ్గించాం. కాగా, మికాసింగ్ తనను అధిగమించి మరీ ఆ సాంగ్ ను ఖాతాలో వేసుకున్నాడు' అని సల్మాన్ చమత్కరించాడు.
ఇదిలా ఉండగా భజరంగి భాయిజాన్ ప్రమోషన్ కార్యక్రమానికి సల్మాన్ దూరంగా ఉండనున్నాడు. ప్రస్తుతం హిట్ అండ్ రన్ కేసులో బెయిల్ పై ఉన్న సల్మాన్ ఖాన్ వేరే నగరాల్లో పర్యటనకు అనుమతి లేనందున భజరంగి భాయిజాన్ కు సినిమా ప్రమోషన్ కు దూరం కానున్నాడు. కాగా ముంబైలోని తన ఇంటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటాడని అతని ప్రతినిధి ఒకరు తెలిపారు.
2012వ సంవత్సరంలో కబీర్-సల్మాన్ కాంబినేషన్ లో వచ్చిన 'ఏక్తా టైగర్' భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత వీరిద్దరి కలయికలో వస్తున్న మరో చిత్రమే భజరంగి భాయిజాన్. ఈ సినిమాను జూలై 17 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.గత రెండు రోజుల క్రితం ఈ చిత్రంలోని 'ఆజ్ కీ పార్టీ' అనే ప్రత్యేక పాటను డైరెక్టర్ కబీర్ ఖాన్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ చక్రబొర్తి, సింగర్ మికా సింగ్ లతో తో కలిసి సల్మాన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.