
సాక్షి, చెన్నై: సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతుంటారు. ఇక సినిమా వాళ్ల సంగతులపై అభిమానుల కుతూహలమే వేరు. అదే విధంగా సోషల్ మీడియాల్లో అలాంటి విషయాలను ఎక్స్‌పోజ్ చేయడానికి రెడీగా ఉంటారు. వీళ్ల దృష్టి అంతా ఇప్పుడు నటి సమంతపైనే. అందుకు కారణం లేకపోలేదు. సాధారణంగా సినిమా వాళ్ల ప్రేమలు పెళ్లి పీటలెక్కడం అన్నది చాలా తక్కువగానే జరుగుతుంటాయి. అలా తన ప్రేమను సక్సెస్‌ఫుల్‌గా పెళ్లి వరకూ తీసుకెళ్లిన నటి సమంత. అదీ ఒక సినిమా కుటుంబానికి చెందిన యువ నటుడిని ప్రేమించి అందరిని ఒప్పించి కల్యాణ ప్రాప్తిరస్తు అనిపించుకోవడం సాధారణ విషయం కాదు.
అలా నాగచైతన్య, సమంతల వివాహ వేడుక అంగరంగవైభవంగా జరిగిపోయింది. ఇక మిగిలింది ఈ నవ జంట హనీమూన్ ఎప్పుడన్న ఆసక్తి వారి అభిమానుల్లో నెలకొంది. వివాహానంతరం కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండవచ్చుగా అనే విమర్శలు వస్తున్నాయి. ఇవేమీ చెవినేసుకోకుండా సమంత, నాగచైతన్య వారి వారి చిత్రాల షూటింగ్‌లలో నిమగ్నమైపోయారు. ఇలాంటి విషయాలపై సమంత స్పందిస్తూ నాగచైతన్య తనను అర్థం చేసుకున్నారని, వివాహానంతరం నటించడానికి ఆయన తనను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. పెళ్లి తరువాత కూడా నటీమణులు సాధించగలరని తాను నిరూపిస్తానని అంటున్నారు. అయితే ఇకపై నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుంటానని, జాతీయ అవార్డులు గెలుచుకోవడమే తన లక్ష్యం అట. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో ఐదు చిత్రాల్లో నటిస్తున్న సమంత వాటిని పూర్తి చేసిన తరువాత హనీ మూన్‌కు ప్లాన్ చేసుకుంటారట.
Comments
Please login to add a commentAdd a comment