
శివకార్తికేయన్‌తో చెన్నై చిన్నది
చెన్నై చిన్నది అనగానే టక్కున గుర్తుకొచ్చేది నటి సమంతనే. నటిగా అతి తక్కువ కాలంలోనే ఎక్కువగా పేరు తెచ్చుకుని ప్రముఖ కథానాయికల పట్టికలో చేరిన నటి సమంత. తమిళం, తెలుగు భాషల్లోనూ వెలిగిపోతున్న ఈ చెన్నై చంద్రం లవ్‌లో పడి ఇటీవల తెలుగు నటుడు నాగచైతన్యను త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వెల్లడించి తన అభిమానులకు తేరుకోలేని షాక్ ఇచ్చారు. వివాహానంతరం సమంత నటించరేమోనన్న సందేహం చిత్ర పరిశ్రమలోనూ నెలకొంది. అందుకు కారణం ఆమె కొత్తగా చిత్రాలను అంగీకరించకపోవడమే. ప్రస్తుతం తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్ అనే ఒకే చిత్రంలో నటిస్తున్నారు.
తాజాగా సమంత అభిమానులకు శుభవార్త ఏమిటంటే తను మళ్లీ కొత్త చిత్రాలను అంగీకరిస్తున్నారు. తమిళంలో శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది తాజా వార్త. ఇంతకు ముందు శివకార్తికేయన్‌తో వరుత్తపడాద వాలిభర్ సంఘం, రజనీమురుగన్ చిత్రాలను తెరకెక్కించిన పొన్‌రామ్ తాజాగా దర్శకత్వం వహించనున్న చిత్రంలోనూ శివకార్తికేయన్ హీరోగా నటించనున్నారు. ఇందులో ఆయనకు జంటగా సమంతను నాయకిగా ఎంపిక చేశారు.ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా రెమో చిత్రాన్ని నిర్మిస్తున్న ఆర్‌డీ.రాజా అదే హీరోతో మోహన్‌రాజా దర్శకత్వంలో మరో చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యారు.
ఇందులో నయనతార నాయకిగా నటించనున్నారు. ఇదే నిర్మాత మళ్లీ శివకార్తికేయన్‌తో మూడో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలోనే సమంత హీరోయిన్‌గా నటించాడానికి ఓకే అన్నారట. ఈ చిత్రాన్ని 2017 ప్రథమార్థంలో ప్రారంభించి దీపావళికి విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీని గురించి నిర్మాత ఆర్‌డీ.రాజా తన ట్విట్టర్‌లో పేర్కొంటూ వెల్‌కమ్ టూ సమంత అని పోస్ట్ చేశారు. ఇక మరికొందరు దర్శక నిర్మాతలు సమంత ముందు క్యూ కట్టే అవకాశం లేకపోలేదంటున్నారు కోలీవుడ్ వర్గాలు.