
శివకార్తికేయన్‌కు నో చాన్స్
బుల్లితెర నుంచి వెండితెరపై కొచ్చి హీరోగా వరుస విజయాలతో తన స్థాయిని పెంచుకుంటూ పోతున్న నటుడు శివకార్తికేయన్. హీరోగా ఎదగడంతో పాటు క్రేజీ హీరోయిన్‌లతో జతకట్టాలని తెగ ఉబలాటపడుతున్నారని సమాచారం. వరుత్తపడాద వాలిబర్ సంఘం చిత్రంలో నటి శ్రీదివ్యతో డ్యూయెట్లు పాడిన శివకార్తికేయన్, ఆ తరువాత ప్రియాఆనంద్, హన్సిక అంటూ పాపులర్ హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు. త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న రజనీ మురుగన్ చిత్రంలో నయనతారతో రొమాన్స్ చేయాలని ఆశపడ్డారు.
అయితే ఆ ప్రయత్నం సఫలం కాలేదు. తాజాగా సమంతాతో స్టెప్స్ వేయాలనుకున్నారనే ప్రచారం జరిగింది. ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో రూపొందించడానికి సిద్ధం అయ్యారు. అయితే ఇప్పుడీ చిత్రంలో సమంత నటించడం లేదని ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. సమంత ప్రస్తుతం చాలా బిజీ హీరోయిన్. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను చిత్రాలున్నాయి. తమిళంలో విక్రమ్ సరసన నటిస్తున్న పత్తు ఎండ్రుదుకుళ్లే చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఇక సూర్యతో అంజాన్ చిత్రం తరువాత 24 అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అదే విధంగా వేల్‌రాజా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ధనుష్‌తో నటిస్తున్నారు. ఆ తరువాత మరోసారి ఇళయదళపతి విజయ్ సరసన నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇవి గాక తెలుగులో మరో రెండు చిత్రాలు చేస్తున్నారు. ఈ ఏడాది తన డైరీ పూర్తి కావడంతో శివకార్తికేయన్‌తో జత కట్టే అవకాశం లేదన్నది సమంత సన్నిహిత వర్గాల సమాచారం.