
ఆటోలో మున్నాభాయ్!
పడవ లాంటి కారులో చెమటపట్టకుండా, బట్టలు నలగకుండా, ఎండ కన్నెరగకుండా సౌకర్యవంతంగా ప్రయాణం చేస్తుంటారు సినిమా స్టార్స్. అలాంటివాళ్లు సాదాసీదా ఆటో ఎక్కినా, ట్రైన్‌లో ప్రయాణం చేసినా కచ్చితంగా అది హాట్ టాపిక్ అవుతుంది. ముంబయ్‌లో రోడ్లు చాలా రద్దీగా ఉంటాయి. ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకుని, విసుగు చెందేవాళ్ల జాబితా చాలానే ఉంటుంది.
అప్పుడప్పుడూ సినిమా స్టార్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుని, షూటింగ్‌కి లేటవుతుందనే టెన్షన్‌తో ఆటోలు, లేదంటే లోకల్ ట్రైన్లు ఎక్కేసి సమయానికి చేరుకుంటుంటారు. అమితాబ్ బచ్చన్, సల్మాన్‌ఖాన్, హృతిక్‌రోషన్, సోనాక్షీ సిన్హా వంటి స్టార్లు ఇలాంటి ప్రయాణాలు చేశారు. తాజాగా సంజయ్ దత్ చేసిన ఆటో జర్నీ గురించి అందరూ వింతగా చెప్పుకుంటున్నారు. సరదాగా ఓ సాయంత్రం స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ముంబయ్‌లోని బాంద్రాలో ఉన్న ఓ రెస్టారెంట్‌కు వెళ్లారాయన.
డిన్నర్ అయిపోయాక, బయటకు వచ్చి చూస్తే, పికప్ చేసుకోవడానికి ఆయన కారు సకాలంలో అక్కడకు చేరుకోలేదు. దాంతో అక్కడే ఉన్న ఆటోను పిలిచారు మన మున్నాభాయ్. స్నేహితునితో సహా ఈ మూడు చక్రాల వాహనం ఎక్కి, ఎంచక్కా ఇంటికి వెళ్ళిపోయారు. ఓ స్టార్ తన ఆటో ఎక్కడం చూసి డ్రైవర్ స్వీట్ షాక్‌కు గురయ్యాడట. ఇంటి దగ్గర దిగాక, మీటర్ 150 రూపాయలే అయినా, ఆ ఆటోడ్రైవర్ చేతిలో నాలుగొందలు పెట్టారట సంజయ్‌దత్.