ఆ రోజు చిరంజీవి అన్నమాట నిజమైంది!
‘‘చిరంజీవిగారి ‘గ్యాంగ్‌లీడర్’ తెలుగులో నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’లో విలన్‌గా చేశాక చిరుగారితో ‘తర్వాత సినిమాలోనూ ఛాన్స్ ఇవ్వండి’ అనడిగా. ‘నువ్ హీరో అయిపోతావ్’ అన్నారు. అలాగే, హీరోనైపోయా. తమిళంలో హీరోగా బిజీ కావడం వల్ల తెలుగులో పెద్దగా ఛాన్సు లు రాలేదనుకుంట!’’ అన్నారు శరత్‌కుమార్. కొంత గ్యాప్ తర్వాత ఆయన చేసిన తెలుగు సినిమా ‘నేనో రకం’. రామ్ శంకర్, రేష్మీ మీనన్ జంటగా సుదర్శన్ శైలేంద్ర దర్శకత్వంలో వంశీధర్‌రెడ్డి సమర్పణలో శ్రీకాంత్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. శరత్‌కుమార్ చెప్పిన సంగతులు.
♦‘నేనో రకం’ వంటి మంచి ఛాన్సులొచ్చిన ప్రతిసారీ తెలుగులో నటించా. ఎమోషన్స్‌తో పాటు మంచి సందేశాత్మక కథతో దర్శకుడు సుదర్శన్ ఈ సినిమా తీశారు. ప్రేమంటే ఏంటి? తల్లిదండ్రుల ప్రేమ.. ఇలా అనేక విషయాలను సినిమాలో చర్చించాం. నా పాత్రతో పాటు హీరో రామ్‌శంకర్ పాత్రను బాగా డిజైన్ చేశారు. నాతో పోటాపోటీగా రామ్‌శంకర్ నటించాడు. సినిమా అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
♦∙చిరంజీవిగారంటే ప్రత్యేకమైన అభిమానం. నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనతో సినిమా నిర్మించాలనుకున్నా. మీ రెమ్యునరేషన్ ఎంతని ఆయన్ను అడగ్గా.. ‘నువ్ నాకు డబ్బులిస్తావా! నువ్వు హెల్ప్ అడిగావ్. ముందు సినిమా, మిగతావన్నీ తర్వాత చూసుకుందాం’ అన్నారు. అప్పుడు సినిమా చేయలేకపోయా. కానీ, ఆయనిచ్చిన ధైర్యం మర్చిపోలేను. ‘ఖైదీ నంబర్ 150’లో చిన్న పాత్రైనా చేస్తానని చిరు, వినాయక్‌లను అడిగా. కానీ, కుదరలేదు. అన్నయ్యతో నటించే ఛాన్స్ వస్తే నేనెప్పుడైనా రెడీ.
♦ మా అమ్మాయి వరలక్ష్మి ఒకడి గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. వరలక్ష్మి చెప్పిన విషయాలు వింటే వాడెంత నీచుడో తెలుస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, సమాజంలో స్త్రీలకూ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వారి పట్ల అమానుషంగా ప్రవర్తించడం సరి కాదు.
♦ నా వందో చిత్రానికి నేనే దర్శకత్వం వహించా. కానీ, దర్శకత్వం అంత ఈజీ కాదు. ప్రతి క్రాఫ్ట్‌ను దగ్గరుండి చూసు కోవాలి. ప్రస్తుతం నాకంత టైమ్ లేదు. ఇప్పటివరకూ 140 సినిమాల్లో నటించా. ఇప్పుడు ఏదైనా కొత్తగా చేయాలనుంది. ఉదాహరణకు... హిందీలో అమితాబ్ చేస్తున్న పాత్రలు లేదా ‘ధృవ’లో అరవింద్ స్వామి పాత్ర వంటివి. నిర్మాతగా విజయ్ ఆంటోనితో ఒకటి, జీవీ ప్రకాశ్‌తో మరొక సినిమా చేస్తున్నా.