తొలిరోజు యావరేజ్ కలెక్షన్లే!
ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఐశ్యర్యరాయ్ తాజా చిత్రం 'సరబ్‌జిత్' తొలిరోజు కలెక్షన్ల విషయంలో తుస్సుమంది. పాకిస్థాన్ జైలులో మగ్గి.. చివరకు అక్కడే తుదిశ్వాస విడిచిన సరబ్‌జిత్ సింగ్ జీవితకథ ఆధారంగా దర్శకుడు ఒమంగ్ కుమార్ తీసిన మరో బయోపిక్ 'సరబ్‌జిత్'. ఆయన గతంలో ప్రియాంకచోప్రాతో తెరకెక్కించిన 'మేరికోమ్' సినిమా ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
ఈ నేపథ్యంలో రణ్‌దీప్ హుడా సరబ్‌జిత్‌గా, ఐశ్యర్యరాయ్ ఆయన సోదరిగా ఎమోషనల్ డ్రామాగా 'సరబ్‌జిత్' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా కథపరంగా, ప్రధాన పాత్రల నటనపరంగా ఈ సినిమా ప్రేక్షకులను కదిలింపజేస్తోంది. పాజిటివ్ మౌత్‌టాక్ వచ్చినప్పటికీ తొలిరోజు 'సరబ్‌జిత్' సినిమా కేవలం రూ. 3.69 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్‌లో మిగతా రెండు రోజుల్లో వచ్చే కలెక్షన్లు ఈ చిత్రానికి కీలకం కానున్నాయి. ఈ సినిమా హిట్టా.. ఫట్టా అన్నది ఇక ప్రేక్షకుల చేతుల్లోనే ఉన్నది.