ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. నిజజీవిత కథల ఆదారంగా తెరకెక్కిన సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే బాటలో ఇటీవల విడుదలైన ఎయిర్ లిఫ్ట్, నీర్జా లాంటి సినిమాలు మంచి విజయాలు సాధించటంతో మరో బయోపిక్ వెండితెర మీదకు వచ్చింది. అయితే ఎలాంటి సెలబ్రిటీ స్టేటస్ లేకపోయినా అన్యాయంగా పాకిస్థాన్ జైలులో ప్రాణాలు కోల్పోయిన ఓ సామాన్యుడి కథను సరబ్జీత్ పేరుతో వెండితెర మీద ఆవిష్కరించారు. తన అన్న విడుదల కోసం 23 ఏళ్ల పాటు పోరాటం చేసే సోదరి పాత్రలో ఐశ్వర్యారాయ్ నటించటంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. జెబ్జా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఐష్, ఆ సినిమాతో నిరాశపరిచినా సరబ్జీత్ ఆకట్టుకుంటుదన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.
పంజాబ్లోని భారత్-పాక్ సరిహద్దులో భిఖివిండ్ గ్రామంలో నివసించే సాధారణ రైతు సరబ్జీత్ సింగ్. అంతా ప్రశాతంగా సాగుతున్నా రైతు జీవితంలో జరిగిన ఓ సంఘటన అతన్ని తన కుటుంబానికీ, దేశానికీ దూరం చేసింది. అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్థాన్లోకి ప్రవేశించిన సరబ్జీత్ను లాహోర్ బాంబు పేలుళ్ల నిందితుడిగా పేర్కొంటూ పాక్ కోర్టు అతనికి ఉరిశిక్ష విధిస్తుంది. ఈ విషయం తెలిసి సరబ్జీత్ సోదరి దల్బీర్కౌర్, తన అన్నను నిర్దోషిగా నిరూపించేందుకు ఏకంగా 23 ఏళ్ల పాటు పోరాటం చేస్తుంది. తన ప్రయత్నాలు కొనసాగుతుండగానే.., ఓ రోజు జైలులో ఖైదీల దాడిలో సరబ్జీత్ చనిపోతాడు. సరబ్ జీత్ మరణం తరువాత దల్బీర్ ఏం చేసింది.? తన అన్నను నిర్ధోషిగా నిరూపించిందా లేదా అన్నదే సరబ్ జీత్ కథ.
ఎన్నో అంచనాల మధ్య ఓమాంగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సరబ్జీత్ అంచనాలను అందుకోవటంలో తడబడింది. ఎలాంటి తప్పు చేయకపోయినా 23 ఏళ్ల పాటు పాకిస్థాన్ జైలులో ఉండి, అక్కడే మరణించిన వ్యక్తి జీవితంపై.., సినిమా అనగానే ప్రేక్షకుల్లో అతని కథ తెలుసుకోవాలన్న ఆసక్తి కలుగుతోంది. అయితే కథ మీద కన్నా ఎక్కువగా ఎమోషన్స్ను చూపించటం మీదే దర్శకుడు దృష్టి పెట్టాడు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో తెరకెక్కిన ఈ సినిమాలో కావాలని పాటలు ఇరికించటం కూడా కాస్త ఇబ్బంది కలిగించింది. ఐశ్వర్యా రాయ్ , రణదీప్ హుడాలు సాంకేతికంగా జరిగిన తప్పులను తమ నటనతో కవర్ చేసే ప్రయత్నం చేశారు. యువతిగా మధ్య వయస్కురాలిగా నటించిన ఐష్ రెండు వేరియేషన్స్ను అద్భుతంగా చూపించింది. ఇక సరబ్ జీత్ పాత్రలో రణదీప్ హుడా ఒదిగిపోయాడు. ఇలా నటన పరంగా ఆకట్టుకున్న సాంకేతికంగా ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ఐశ్వర్య రీ ఎంట్రీలో రెండో ప్రయత్నంలో కూడా ఆకట్టుకోలేకపోయింది.
ఐశ్వర్య రెండో ప్రయత్నం కూడా ఆకట్టుకోలేదు
Published Fri, May 20 2016 2:17 PM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM
Advertisement