'సర్థార్ గబ్బర్సింగ్' మూవీ రివ్యూ
'సర్థార్ గబ్బర్సింగ్' మూవీ రివ్యూ
Published Fri, Apr 8 2016 12:20 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
టైటిల్ : సర్దార్ గబ్బర్సింగ్
జానర్ : యాక్షన్ డ్రామా
తారాగణం : పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్, శరద్ కేల్కర్, ముఖేష్ రుషి, అలీ
దర్శకత్వం : కే యస్ రవీంద్ర (బాబీ)
నిర్మాత : శరత్ మరార్
దాదాపు మూడేళ్ల విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోలో హీరోగా తెరకెక్కిన సినిమా సర్దార్ గబ్బర్సింగ్. పవన్ కెరీర్లో బిగెస్ట్ హిట్గా నిలిచిన గబ్బర్సింగ్ సినిమాలోని క్యారెక్టరైజేషన్తో తెరకెక్కిన ఈ సినిమా కోసం, పూర్తిగా కొత్త కథా కథనాలను ఎంపిక చేసుకున్నారు. గబ్బర్సింగ్ సక్సెస్తో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు లాంగ్ గ్యాప్ తరువాత పవన్ సోలో హీరోగా తెరకెక్కిన సినిమా కావటంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఆ అంచనాలను సర్దార్ గబ్బర్సింగ్ అందుకుందా..? పవన్ ముందున్న రికార్డ్లు సర్దార్ బుల్లెట్ల దెబ్బకు బద్దలయ్యాయా..?
కథ :
రతన్ పూర్ తెలుగు రాష్ట్ర సరిహద్దులోని ప్రాంతం. ఇప్పటికీ రాజరికపు వ్యవస్థ పాలనలో ఉన్న ఈ ప్రాంతంలో ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, ఆ రాజవంశీకుల కనుసన్నల్లోనే నడుస్తుంటారు. రాజుగారు చనిపొవటవంతో రాజవంశానికి చెందిన మూడు కుటుంబాలు అధికారం, ఆస్తుల కోసం పోటీపడతాయి. దుర్మార్గుడైన భైరవ్(శరద్ కేల్కర్) తన బలం, బలగంతో ఊరి ప్రజలను బయపెట్టి వ్యాపారం చేస్తుంటాడు. కానీ రాజుగారి వారసురాలు ఆర్శి దేవి( కాజల్ అగర్వాల్) ఉన్న ఆస్తులను అమ్మి తన తండ్రి ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుంటుంది. రాజవంశానికి దళపతి అయిన హరినారాయణ (ముఖేష్ రుషి) ఆమెకు సాయంగా భైరవ్ నుంచి ఇబ్బందులు ఎదురు కాకుండా కాపాడుతుంటాడు.
రాజకుంటుంబాన్ని, ఆ ఊరి ప్రజలను భైరవ్ భారీ నుంచి కాపాడే సరైన వ్యక్తి కోసం హరినారాయణ ఎదురు చూస్తుంటారు. ఆ సమయంలో అతడి స్నేహితుడైన పోలీస్ అధికారి, రతన్ పూర్కు సిఐగా కండబలం, బుద్ధిబలం ఉన్న సర్దార్ గబ్బర్సింగ్(పవన్ కళ్యాణ్)ను పంపిస్తాడు. అనాథగా పెరిగిన సర్దార్, అతని స్నేహితుడు సాంబా ఓ పోలీస్ అధికారి సాయంతో డిపార్ట్ మెంట్ లో చేరతారు. ఎవరి మాట వినకుండా మొండిగా వ్యవహరించే సర్దార్, రతన్ పూర్లో అడుగుపెట్టిన తరువాత తొలిసారిగా భైరవ్కు ఎదురు నిలబడే వాడు ఒకడు వచ్చాడన్న ధైర్యం, ఆ ఊరి జనంలో కనిపిస్తుంది.
అదే సమయంలో రాజకుమారిని ఆ ఇంటి పనిమనిషిగా భావించిన ప్రేమలో పడతాడు సర్దార్. అదే రాకుమారిని తన సొంతం చేసుకొని రాజవంశానికి చెందిన మొత్తం ఆస్తిని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు భైరవ్. అలా డ్యూటీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా భైరవ్, సర్దార్ల మధ్య యుద్ధం మొదలవుతుంది. మరి ఈ యుద్ధంలో ఎవరు ఎలా దెబ్బకొట్టారు. చివరకు భైరవ్ సామ్రాజ్యాన్ని సర్దార్ ఎలా కూల్చేశాడు అన్నదే మిగతా కథ.
నటీనటులు :
గబ్బర్సింగ్ పాత్రతో తెలుగు సినిమాకు కిక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి అదే పాత్రలో ఆకట్టుకున్నాడు. కామెడీ యాక్షన్, ఎమోషన్లను అద్భుతంగా పలికించి సినిమా అంతా వన్ మేన్ షోలా నడిపించాడు. యువరాణి పాత్రలో కాజల్ ఆకట్టుకుంది. మగథీర సినిమాలో మిత్రవింద తరహాలోనే సాగిన పాత్ర, పెద్దగా కొత్తగా కనిపించకపోయినా, తొలిసారిగా పవన్ సరసన నటించి మెప్పించింది. విలన్ పాత్రలో తెలుగు తెరకు పరిచయం అయిన శరద్ కేల్కర్ ఫరవాలేదనిపించాడు. నటన పరంగా ఓకె అనిపించిన శరద్, లుక్ విషయంలో మాత్రం మెప్పించాడు. రాక్షసుడైన రాజుగా సరిగ్గా సరిపోయాడు. ముఖేష్ రుషి, రావు రమేష్, అలీ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి ఇలా భారీ తారాగణం ఉన్న ఈ సినిమాలో ఎవరికి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణులు :
తెర మీదే కాదు తెర వెనక కూడా ఈ సినిమాతో పవన్ కళ్యాణ్దే కీలక పాత్ర. కథా కథనాలను అందించటంతో పాటు అంతా తానే అయి సినిమాను ముందుకు నడిపించాడు పవన్. అయితే కథా పరంగా మెప్పించినా, కథనం పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ సాగదీసినట్టుగా అనిపించింది. దర్శకుడిగా బాబీ ఆకట్టుకున్నాడు.
మాస్ యాక్షన్ సినిమాకు తను మంచి ఛాయిస్ అని ప్రూవ్ చేసుకున్నాడు. సాయిమాధవ్ బుర్రా మాటలు బాగున్నాయి. చాలా సందర్భాల్లో పవన్ వ్యక్తిత్వాన్ని డైలాగ్స్లో వినిపించే ప్రయత్నం చేశారు. యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. అయితే క్లైమాక్స్ ఫైట్లో మితిమీరిన తూపాకుల మోత కాస్త ఇబ్బంది పెడుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ పాటలతో పాటు నేపథ్య సంగీతంలోనూ తన మార్క్ చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
పవన్ కళ్యాణ్
యాక్షన్ సీన్స్
సంగీతం
మైనస్ పాయింట్స్ :
బోర్ కొట్టించే లవ్ సీన్స్, స్క్రీన్ ప్లే
ఓవరాల్గా సర్థార్ గబ్బర్సింగ్ పవన్ అభిమానులను మెప్పించే యాక్షన్ ఎంటర్టైనర్
- సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్
Advertisement
Advertisement