మాధురీ.. జూహీలను కలిపిన సినిమా
'గులాబ్ గంగ్' చిత్రంలో తనకు నెగెటివ్ పాత్ర ఇవ్వగానే మొదట చాలా భయపడినట్లు అలనాటి అందాల హీరోయిన్ జూహీ చావ్లా తెలిపింది. తనను అలాంటి పాత్రలో అసలు ప్రేక్షకులు ఆమోదిస్తారా లేదా అనే అనుమానం తనకు వచ్చిందంది. బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉండే కొంతమంది మహిళల స్ఫూర్తితో ఈ పాత్రను దర్శకుడు తీర్చిదిద్దారు. ఈ పాత్ర మహిళా సాధికారత గురించి మాట్లాడుతుంది. డైరెక్టర్ ఈ కథ చెప్పగానే బాగుందనిపించినా, తన పాత్ర గురించే భయపడ్డానని జూహీ తెలిపింది. వేరే ఎవరినైనా అడగబోయి తనను అడిగారా అని కూడా అనుమానపడ్డానంది. చాలా భయపడినా చివరకు ఆ పాత్ర చేశానని, ఇప్పటికీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందోనన్న భయం మాత్రం తనకుందని ఈ ఉంగరాల జుట్టు సుందరి చెప్పింది. దీనికి ముందు అసలు తనకెప్పుడూ నెగెటివ్ పాత్రలు రాలేదని, ఇప్పుడు ఇన్నాళ్లకు ఇలాంటి పాత్ర రావడంతో తనకు ఆనందంగా ఉందని తెలిపింది.
అంతేకాదు.. ఈ సినిమాలో ఒకప్పటి తన ప్రధాన ప్రత్యర్థి మాధురీ దీక్షిత్తో కలిసి జూహీ చావ్లా నటించడం మరో విశేషం. 1990లలో వీరిద్దరూ ఒకే సమయంలో బాలీవుడ్ను ఏలారు. అయితే ఎప్పుడూ కలిసి మాత్రం నటించలేదు. ఇప్పుడు గులాబ్ గంగ్ సినిమా అంగీకరించడానికి మాత్రం, అందులో మాధురి ఉండటం, స్క్రిప్టు బాగుండటమే కారణాలని జూహీ తెలిపింది. ఆమె అద్భుతమైన నటి అని, చాలా అందంగా ఉంటుందని అంది. వీరిద్దరి మధ్య ఇన్నాళ్లూ ఉన్న అడ్డుగోడలను తొలగించిన ఘనత మాత్రం తొలిసారి మెగాఫోన్ పట్టుకుంటున్న దర్శకుడు సౌమిక్ సేన్కే దక్కింది.