సీనియర్ సౌండ్ ఇంజినీర్ స్వామినాథన్ ఇకలేరు | senior sound engineer Swaminathan died | Sakshi
Sakshi News home page

సీనియర్ సౌండ్ ఇంజినీర్ స్వామినాథన్ ఇకలేరు

Published Tue, Jun 24 2014 11:13 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

సీనియర్ సౌండ్ ఇంజినీర్ స్వామినాథన్ ఇకలేరు - Sakshi

సీనియర్ సౌండ్ ఇంజినీర్ స్వామినాథన్ ఇకలేరు

సినీ జగమెరిగిన శబ్దగ్రాహకుడు ఏఆర్ స్వామినాథన్ మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 87 ఏళ్లు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషల్లో సుమారు 1900 చిత్రాలకు ఆయన సౌండ్ ఇంజినీర్‌గా పని చేశారు. లక్షకు పైగా పాటలకు శబ్దగ్రహణం చేశారు. ప్రపంచంలో ఏ సౌండ్ ఇంజినీరూ ఇన్ని చిత్రాలకు పనిచేయలేదు. నిజంగా ఇదొక రికార్డ్.1927 ఆగస్టు 26న తమిళనాడులోని తంజావూరు జిల్లా ఆరుపాడి గ్రామంలో రామయ్య, ఆలమేలు దంపతులకు పుట్టిన స్వామినాథన్ 1949లో వాహినీ సంస్థ సౌండ్ డిపార్ట్‌మెంట్‌లో అప్రెంటీస్‌గా కెరీర్ మొదలుపెట్టారు. మొదట్లో శబ్ద యంత్రాలకు సర్వీసింగ్ పనులు చేసిన ఆయన తర్వాత రికార్డిస్టుగా మారారు.
 
  కె. విశ్వనాథ్ అప్పట్లో ఆయనకు కొలీగ్. ప్రసిద్ధ గాయకుడు ఘంటసాల నిర్మించిన ‘పరోపకారం’ (1953) చిత్రానికి తొలిసారిగా రీరికార్డింగ్ బాధ్యతలు నిర్వహించారు. అప్పటినుంచీ ఆయన వెనుతిరిగి చూడలేదు. రాత్రింబవళ్లూ పాటల రికార్డింగులు, రీరికార్డింగులతో మమేకమైపోయారు. ఇంటిని కూడా మరిచిపోయి రికార్డింగ్ థియేటరే ప్రపంచం అన్నట్టుగా బతికారు. ఎంత ఒత్తిడి ఉన్నా స్వామినాథన్ రీరికార్డింగ్ శ్రద్ధగా, చురుగ్గా చేస్తారని ప్రతీతి. పాండురంగ మహాత్మ్యం, పాండవ వనవాసం, అల్లూరి సీతారామరాజు, శంకరాభరణం, సంపూర్ణ రామాయణం వంటి ఎన్నెన్నో గొప్ప చిత్రాలకు తన శబ్ద చాతుర్యాన్ని మేళవించి కొత్త సొగసులు తీసుకొచ్చారు.
 
  ప్రసిద్ధ నేపథ్య గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తొలిసారిగా పాడిన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంలోని ‘ఏమి ఈ వింత మోహము’ పాటను ఆయనే రికార్డ్ చేశారు. 1964 నుంచి 24 ఏళ్ల పాటు ‘విజయా’ రికార్డింగ్ థియేటర్‌లో పనిచేసి కొన్ని వేల పాటలు రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు చెందిన కోదండపాణి రికార్డింగ్ స్టూడియోలో చేరారు. మేఘసందేశం (1982), సాగర సంగమం (1983), శ్రుతిలయలు (1987), సూత్రధారులు (1989), జగదేక వీరుడు-అతిలోక సుందరి (1990) చిత్రాలకు నందీ పురస్కారాలు అందుకున్నారు. 
 
 స్వామినాథన్‌కు భార్య రుక్మిణి, కొడుకులు నారాయణ్, శ్రీనివాసన్, కూతుళ్లు ఉషా, శాంతి, లలిత ఉన్నారు. పదిహేను రోజుల క్రితం మంచం మీద నుంచి కింద పడిపోగా కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. తుంటి ఎముక విరగడంతో శస్త్ర చికిత్స చేశారు.  మంగళవారం ఉదయం 11.20 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. బుధవారం ఉదయం చెన్నైలో స్వామినాథన్ అంత్యక్రియలు జరుగనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement