కనీ వినీ ఎరుగని రీతిలో...
కనీ వినీ ఎరుగని రీతిలో...
Published Sun, Jan 26 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని పుస్తకాల్లో మాత్రమే చదువుకున్నాం. నాటి సామ్రాజ్య శోభ, సంస్కృతి, సంప్రదాయం, రాజనీతి, యుద్ధనీతి... ఇవన్నీ ఇప్పటిదాకా ఊహలకు మాత్రమే పరిమితం. వెండితెరపై దాన్ని కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు గుణశేఖర్. ‘రుద్రమదేవి’ చరిత్రకు తెరరూపాన్నిచ్చి, భావితరానికి గొప్ప మేలునే చేస్తున్నారాయన. అనుష్క రుద్రమదేవిగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం కీలక ఘట్టానికి చేరుకుంది.
ప్రపంచ చరిత్రలో న భూతో న భవిష్యత్ అన్న చందాన కాకతీయ సామ్రాజ్యానికి రక్షణగా... రాతికోట, మట్టికోట, ముళ్ల కోట, కంకర కోట... ఇలా ఏడు రకాల కోట గోడల్ని శత్రుదుర్భేద్యంగా రాణీరుద్రమ నిర్మించినట్లు చరిత్ర. నాటి కట్టడాలను ప్రేక్షకుల కళ్లకు కట్టే ప్రయత్నంలో ఉన్నారు ఈ చిత్ర కళా దర్శకుడు తోట తరణి. గోపనపల్లిలో గత 40 రోజులుగా ఈ కోట గోడల నిర్మాణం జరుగుతోంది. దీని గురించి గుణశేఖర్ మాట్లాడుతూ -‘‘వేలాది మంది దేవగిరి సైన్యం ఈ కోట గోడల్ని ముట్టడించే ప్రయత్నం చేస్తే... ఆ ప్రయత్నాన్ని కాకతీయ సైన్యంతో రుద్రమ ఎలా ఎదుర్కొన్నారో ఈ సెట్‌లో చిత్రీకరించనున్నాం. కనీ వినీ ఎరుగని రీతిలో ఈ పోరాట సన్నివేశాలుంటాయి.
ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 20 వరకూ ఈ సన్నివేశాల్ని చిత్రీకరిస్తాం. ఈ చిత్రాన్ని స్టీరియోస్కోపిక్ త్రీడీ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ కారణంగా ప్రేక్షకులు అప్పటి కాలానికి, ఆయా సంఘటనల్లోకి స్వయంగా వెళ్లిన అనుభూతికి లోనవుతారు. అనుష్క, రానాలతో పాటు కృష్ణంరాజు, సుమన్, ప్రకాష్‌రాజ్, ఆదిత్యమీనన్, విక్రమ్‌జీత్, నిత్యామీనన్, కేథరిన్, హంసానందిని, బాబా సెహగల్ తదితరులు ఈ పోరాట సన్నివేశాల్లో పాల్గొంటారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: ఇళయరాజా, కూర్పు: శ్రీకరప్రసాద్, నిర్మాత: కె.రామ్‌గోపాల్, సమర్పణ: రాగిణీ గుణ.
Advertisement
Advertisement