
డీజే డైరెక్టర్ వార్నింగ్
హైదరాబాద్: అల్లు అర్జున్ తాజా సినిమా దువ్వాడ జగన్నాథమ్ (డీజే)ను పైరసీ చేసిన వారిపై కఠిన చర్యలకు చిత్రయూనిట్ సిద్ధమవుతోంది. తమ సినిమాను సోషల్ మీడియాలో పెట్టినవారిని గుర్తించే పనిలో పడ్డామని దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు. పేర్లు, ఐడెంటిటీస్, ఐపీ అడ్రసులను ట్రేస్ చేస్తున్నట్టు వెల్లడించారు. పైరసీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఆన్‌లైన్‌లో పైరసీ లింకుల గురించి తమకు సమాచారం అందించాలని అభిమానులతో పాటు సినిమా ప్రేమికులకు విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్స్ అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. పైరసీ లింకుల గురించి సమాచారం అందించేందుకు ముందుకు వచ్చిన మహేశ్‌బాబు, ఎన్టీఆర్ అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. శుక్రవారం విడుదలైన దువ్వాడ జగన్నాథమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.