
మణిరత్నం చిత్రంలో శింబు
తమిళసినిమా: ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన కాట్రువెలియిడై చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఆయన తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. తాజాగా ఒక ఆసక్తికరమైన ప్రచారం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మణిరత్నం ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. అదే ఇప్పుడు వాస్తవం కాబోతోందనిపిస్తోంది.
ఆయన తాజా చిత్రంలో విజయ్‌సేతుపతి హీరోగా నటించనున్నారని, అదే విధంగా కథానాయకిగా ఐశ్వర్యరాజేశ్ నటించనున్నారని, మరో ప్రధాన పాత్రలో నటి జ్యోతిక, అదే విధంగా అరవిందస్వామి, ఫాహద్ ఫాజిల్ వంటి ప్రముఖ నటీనటులు కూడా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ టీమ్‌లోకి సంచలన నటుడు శింబు వచ్చి చేరారు. అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రం నిరుత్సాహపరిచిన తరువాత శింబు నటించే చిత్రం ఏమిటని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకిది సంతోషాన్నిచ్చే వార్తే అవుతుంది.
దీనికి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించనున్నారు. పాటలను వైరముత్తు రాస్తున్నారట. ఈ చిత్రంతో మణిరత్నం, ఏఆర్.రెహ్మాన్, వైరముత్తుల కలయిక అన్నది రోజా చిత్రం నుంచి అంటే 25 ఏళ్లుగా కొనసాగుతోందన్నది గమనార్హం. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రానికి సంతోష్‌శివన్ ఛాయాగ్రణను అందించనున్నారని సమాచారం. రజనీకాంత్ నటించిన దళపతి చిత్రంతో ప్రారంభమైన మణిరత్నం, సంతోష్‌శివన్‌ల కాంబినేషన్ ఆ తరువాత రోజా, ఇరువర్, ఉయిరే, రావణన్ చిత్రాల వరకూ సాగింది. తాజా చిత్రం ఆరోది అవుతుందన్న మాట. ఈ చిత్రాన్ని మణిరత్నం జనవరిలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.