అతని మాటలకు షాక్ తిన్నా..! - ప్రియాంకా చోప్రా
స్త్రీల కన్నా పురుషులకు గుర్తింపు, ప్రాధాన్యం ఇవ్వడం ఏ రంగంలోనైనా ఉండేదే. కానీ ఇది సినీ పరిశ్రమలో మరీ ఎక్కువ. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ చాలా మంది ప్రముఖ నటీమణులు ఈ విషయంలో వివక్షను ఎదుర్కొన్నారు కూడా. గతంలో హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ ఈ విషయంపై మొదటి సారిగా గళం విప్పారు. ఇటీవలే నటి ఎమ్మావాట్సన్ కూడా పారితోషికాల విషయంలో హాలీవుడ్‌లో యాక్టర్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని బహిరంగంగానే ఆరోపించారు. తాజాగా బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా కూడా ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నాకు ఈ విషయం గురించి అంత అవగాహన ఉండేది కాదు.
ఒకవేళ మా డేట్స్ మ్యాచ్ కాకపోయినా, ఎంతో కొంత పారితోషికం ఆశిస్తున్నా సరే...మీ బదులు కొత్త అమ్మాయిని తీసుకుంటామని, అంతేగాని హీరోలను మార్చే ప్రసక్తి లేదని అప్పట్లోనే నాతో ఓ నిర్మాత నిర్మొహమాటంగానే చెప్పారు. అతని మాటలకు నేను షాక్ తిన్నాను. ‘బాజీరావ్ మస్తానీ’ షూటింగ్ టైంలో నేను, దీపికా ఈ విషయం గురించి చర్చించుకున్నాం. ఏ రంగంలోనైనా ఇంతే. కార్పొరేట్ కంపెనీలకు మహిళలు సీఈవోలుగా పనిచేస్తున్నా, వారికి తక్కువ జీతాలే అందుతాయి. అయినా నాకు ఎప్పటికైనా ఒక్కటే ఆశ. పురుషులతో సమానంగా ట్రీట్ చే యకపోయినా పర్లేదు గానీ మా ప్రతిభకు, మా మాటకు కాస్త విలువ ఇవ్వాలని కోరుతున్నా. ఎప్పటికైనా మార్పు వస్తుందన్న ఆశ ఉంది’’ అని అన్నారు.