హిందీ బిగ్ బాస్ 12
హిందీ బిగ్‌బాస్ సీజన్ 12 మొదలైన రెండో రోజుల్లోనే ఎన్నో కొట్లాటలు, మరెన్నో వివాదాలతో రచ్చ రచ్చ అవుతోంది. అప్పుడే హౌజ్‌మేట్స్ కోపతాపాలు ప్రదర్శిస్తున్నారు.. తాజాగా మాజీ క్రికెటర్ శ్రీశాంత్, మైక్ విసిరి కొట్టి మరీ, తాను హౌజ్ నుంచి బయటికి వెళ్లిపోతానంటూ బెదిరించాడు. ఇదంతా ఎందుకు జరిగింది? అసలు ఎక్కడ గొడవ మొదలైంది అంటే.. శ్రీశాంత్‌కు ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేయకపోవడం, అక్కాచెల్లెళ్లుగా బిగ్‌బాస్ 12లోకి ప్రవేశించిన సోమి, సబా ఖాన్‌లతో శ్రీశాంత్ వాడివేడి వివాదానికి దిగడం బిగ్‌బాస్ 12 హౌజ్‌ను హీటెక్కేలా చేసింది. అంతేకాక షిండే, కరణ్ పటేల్ కూడా శ్రీశాంత్ అసంతృప్తికర వైఖరికి కోపం ప్రదర్శించారు.
శ్రీశాంత్ వ్యవహారంతో, బిగ్‌బాస్ అందరి టాస్క్‌లను రద్దు చేసేశారు. తమ తొలి టాస్కే ఇలా గందరగోళంగా మధ్యలో ఆగిపోవడంతో, హౌజ్‌మేట్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేసి, కోపంతో ఊగిపోయారు. దీపిక కకార్, కరణ్‌వీర్ బోహ్రాలు శ్రీశాంత్‌కు బిగ్‌బాస్ హౌజ్‌లో ఇచ్చే టాస్క్‌లు పూర్తి చేయడం ఎంతో ముఖ్యమో నచ్చచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ, అవి ఫలించలేదు. అప్పటికే పరిస్థితి అంతా చేదాటిపోయింది. తీవ్ర కోపోద్రిక్తుడైన శ్రీశాంత్ వెంటనే మైక్ తీసేసి, గేట్ ఓపెన్ చేయండి, నేను షో నుంచి బయటికి వెళ్లిపోతా అంటూ బిగ్గరగా అరిచాడు. అయితే శ్రీశాంత్ హౌజ్‌లోనే ఉంటాడా? లేదా బయటికి వెళ్లిపోతాడా? అనేది బిగ్‌బాస్ నిర్ణయించనున్నారు. ఈ రోజు రాత్రి జరగబోయే బిగ్ బాస్ 12 ఎపిసోడ్‌లో ఈ విషయం రివీల్ అవనుంది. హౌజ్‌లో ఉన్నంత కాలం బిగ్‌బాస్ ఇచ్చే అన్ని పనులను ప్రతి కంటెస్టెంట్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ హౌజ్ నుంచి శ్రీశాంత్ బయటికి వస్తే, మధ్యలో షో వదిలివేస్తుండటంతో అతను 50 లక్షల రూపాయలను కోల్పోనున్నారు. శ్రీశాంత్ అంతకముందు కూడా డ్యాన్స్ రియాల్టీ షో ఝలక్ దిక్లా జా నుంచి మధ్యలోనే బయటికి వచ్చేశారు. అతని పర్‌ఫార్మెన్స్‌లో తప్పులను ఎత్తి చూపినందుకు గాను జడ్జీలు మాధురి దీక్షిత్, రెమో డీ సౌజా, కరణ్ జోహార్‌లతో గొడవపడి, ఆ రియాల్టీ షో నుంచి వాకౌట్ అయ్యారు. కాగా, తెలుగులో రన్ అవుతున్న బిగ్‌బాస్ 1 రియాల్టీ షోలో కూడా ఇదే రకమైన పరిస్థితి కనిపించింది. నటుడు సంపూర్ణేశ్ బాబు కూడా ‘నాది పల్లెటూరి నేపథ్యం. ఇక్కడ నన్ను బంధించేసినట్టుగా ఉంది. నన్ను ఇంటికి పంపించేయండి’ అని బిగ్‌బాస్ షోలో ప్రాధేయ పడ్డాడు. అలా సంపూ ఆరోగ్య స్థితిని గమనించి, హౌజ్‌మేట్స్ అందరూ కలిసి, ఎలిమినేట్ చేయడానికి అతిని పేరును నామినేట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment