
గౌను తెచ్చిన ఇబ్బంది!
‘‘ ‘రేయ్’లో నేను చేసిన పాప్ స్టార్ పాత్ర నా కెరీర్‌కి మంచి బ్రేక్‌నిస్తుంది’’ అని శ్రద్ధాదాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. సాయిధరమ్ తేజ్ హీరోగా స్వీయదర్శకత్వంలో వైవీయస్ చౌదరి రూపొందించిన ‘రేయ్’ ఈ నెల 27న విడుదల కానుంది. ఇందులో ప్రతినాయిక పాత్ర చేసిన శ్రద్ధాదాస్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో చేసిన మెక్సికన్ అమెరికా పాప్‌స్టార్ పాత్ర కోసం బరువు తగ్గాను. జెన్నిఫర్ లోపెజ్, బ్రిట్నీ స్పియర్స్ వంటి హాలీవుడ్ తారల వీడియోలను వైవీయస్‌గారు చూపించారు.
వాళ్ల స్టయిల్‌ని చూసి, నాదైన శైలిలో ఈ పాత్ర చేశాను. ఈ సినిమా కోసం 250 నుంచి 300 కాస్ట్యూమ్స్ వాడాను. రెక్కలున్న ఓ గౌను అయితే నన్ను చాలా ఇబ్బందిపెట్టేసింది. అది వేసుకున్న తర్వాత కూర్చోవడానికి కుదిరేది కాదు. ఆ గౌనుకి సంధించిన షూటింగ్ చేసినన్నాళ్లు నిలబడే ఉండేదాన్ని. వైవీయస్‌గారి టేకింగ్ బ్రహ్మాండం. ‘నరసింహా’లో రమ్యకృష్ణ చేసిన తర్వాత ఆ స్థాయి ఉన్న పాత్ర ఇదే అవుతుందనీ, బాగా నటించావనీ రష్ చూసినవాళ్లు చెబుతున్నారు. అందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు.