
శ్రియ బాధ ఏంటో?
తమిళసినిమా: నటి శ్రియ బాధల్లో ఉందట. ఒకప్పుడు కోలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన నటి శ్రియ. విజయ్, జీవా ఇలా పలువురు హీరోలతో జత కట్టిన ఈ భామ అనతికాలంలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో శివాజీ లాంటి భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. దీంతో అప్పట్లో ఈ అమ్మడి లక్ చూసి తోటి హీరోయిన్లు అసూయపడ్డారు కూడా. అలాంటి నటి ఆ తరువాత కోలీవుడ్‌లో కనిపించకుండాపోయింది.
అప్పటినుంచి కోలీవుడ్‌లో మళ్లీ తన స్థానాన్ని పొందడానికి చేయని ప్రయత్నాలు లేవనే చెప్పాలి. అలా చాలా కాలం తరువాత శింబు తో జత కట్టే అవకాశాన్ని దక్కించుకుంది. ఆయన త్రిపాత్రాభినయం చేసిన అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో శ్రియ, తమన్నా కథానాయికలుగా నటించారు. ఆ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్న శ్రియ శింబుతో లిప్‌లాక్ చుంబనా లకు కూడా వెనుకాడకుండా నటించింది. అయినా ఫలితం దక్కలేదు.
ఇటీవలే విడుదలైన ఆ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. దీంతో శ్రియ చింతలో పడిపోయిందట. అయితే తెలుగులో మాత్రం శ్రియ పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. ఆ మధ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి, అంతకుముందు నటించిన మనం చిత్రాల్లో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా బాలకృష్ణతో పైసావసూల్ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఒక అవార్డుల కార్యక్రమంలో శ్రియ చీరకట్టు చాలా గ్లామరస్‌గా ఉందంటూ విమర్శలను ఎదుర్కొంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీని గురించి శ్రియ పెదవి విప్పడం లేదు.