
సాక్షి, చెన్నై : సినిమా రంగం ఒక వ్యసనం లాంటిది. ఇందులో దిగామంటే వదిలి వెళ్లడం చాలా కష్టం. అవకాశాలు తగ్గినా దానిపై మోహం మాత్రం పోదు. ముఖ్యంగా కథానాయికలు అందులోనూ అగ్రకథానాయికలుగా రాణించిన వారు ఆ స్థాయిని పెళ్లి కారణంగా వదులు కోవడానికి అంగీకరించలేరు. ఇక విషయానికి వస్తే దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా రాణించిన శ్రియ హిందీలోనూ అడపాదడపా నటిస్తున్నారు. అలాంటిది మూడు పదులు వయసును దాటిన ఈ ముద్దుగుమ్మ అనూహ్యంగా రష్యాకు చెందిన తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రీ కోస్‌చీవ్‌ను గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నారు. అయితే అంతకు ముందు తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసుకుంది.
నిజం చెప్పాలంటే శ్రియ పెళ్లికి ముందు వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. తెలుగులో పైసా వసూల్, గాయత్రి, తమిళంలో అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ వంటి చిత్రాలు ఆశించిన విజయాలను సాధించలేదు. ప్రస్తుతం హిందీలో నటించిన ఫామ్‌హైస్, తడ్కా, తమిళంలో నరకాసురన్, తెలుగులో నటించిన వీరభోగవసంతరాయలు చిత్రాలు విడుదల కావలసి ఉన్నాయి. వీటిలో తమిళ చిత్రం నరకాసురన్‌లో శ్రియ ప్రతినాయకి ఛాయలున్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయినా దర్శక, నిర్మాతల మధ్య వివాదాలు, ఆర్థిక పరమైన సమస్యల కారణంగా విడుదలలో జాప్యం జరుగుతోంది. వివాహనంతరం నటించేది, లేనిది శ్రియ వెల్లడించలేదు. అయితే భర్తతో కలిసి రష్యాలో సెటిల్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే వివాహానంతరం నటి జ్యోతిక, సమంత వంటి నటీమణులు నటనను కొనసాగించడంతో శ్రియకు కూడా నటనను కొనసాగించాలని ఆశ పడుతున్నట్లు, అయితే చేతిలో ఒక్క అవకాశం లేకపోవడంతో ఆలోచనలో పడ్డారని సమాచారం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చిత్రాలు సక్సెస్ అయితే మళ్లీ నటించాలని, లేకపోతే సంసార జీవితంలో మునిగిపోవాలని భావిస్తున్నారట. మొత్తం మీద తన నట భవిష్యత్‌ను విడుదల కానున్న చిత్రాలు నిర్ణయిస్తాయన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment