ఫిఫ్టీన్ ఇయర్స్ పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్
హీరోయిన్‌లకు ఎంత గుడ్ లక్ ఉంటుందో, అంత బ్యాడ్ లక్ కూడా ఉంటుంది. ఎంత త్వరగా హిట్ అవుతారో... అంతే త్వరగా వాళ్ల ఇన్నింగ్స్ ముగిసిపోతాయి. ఆ తర్వాత ఐటెమ్ సాంగ్స్. అక్కా, వదిన పాత్రలు చేసుకోవాల్సిందే. పాత తరం హీరోయిన్లకైతే 15, 20 ఏళ్ల కెరీర్ స్పాన్ ఉండేది. ఇప్పుడలాంటి అవకాశమే ఉండటంలేదు. అలాగని అందర్నీ ఒకే గాటన కట్టేయలేం. శ్రీయ, త్రిష, తమన్నా లాంటివాళ్లు మహా జోరుగా లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. శ్రీయ అయితే.. స్టిల్ 15 ఇయర్స్ బ్యాటింగ్. పదిహేనేళ్లయినా ఎక్కడా పట్టు తగ్గకుండా ఆమె సినిమాలు చేయగలుగుతున్నారు.
2001లో ‘ఇష్టం’తో ఎంతో ఇష్టంగా కథానాయికగా పరిచయం అయ్యారు శ్రీయ. ఆ సినిమా గొప్పగా ఆడకపోయినా నలుగురి దృష్టీ శ్రీయ మీద పడింది. ఆ తర్వాత చేసిన ‘సంతోషం’ శ్రీయను తిరుగు లేని తారను చేసింది. అప్పట్నుంచీ ఏడాదికి ఐదారు సినిమాలకు తగ్గకుండా, క్షణం తీరిక లేకుండా సినిమాలు చేశారు. అంతెందుకు.. 2005లో ఎనిమిది కథానాయిక పాత్రలూ, రెండు అతిథి పాత్రలతో కలుపుకుని తెలుగు, తమిళ భాషల్లో మొత్తం పది చిత్రాల్లో మెరిశారు. ఇది మామూలు రికార్డ్ కాదు. సరే.. పదిహేనేళ్లయ్యింది కదా.. పైగా నూతన తారలు దూసుకొచ్చేశారు.
ఇప్పుడైనా శ్రీయ వెనక్కి తగ్గాల్సిందే. మరి తగ్గారా? లేదు. ఏడాదికి రెండు సినిమాలైనా దక్కించుకోగలుగుతున్నారు. అవీ దాదాపు హిట్ సినిమాలే. అయితే విశేషం ఏంటంటే... ఈ రెండేళ్లల్లో ఆమె చేసినవన్నీ రీమేక్‌లే. 2015లో వెంకటేశ్ సరసన శ్రీయ నటించిన ‘గోపాల గోపాల’ హిందీ ‘ఓ మైగాడ్’కి రీమేక్. హిందీలో చేసిన ‘దృశ్యం’ మలయాళ ‘దృశ్యం’కి రీమేక్. ఇక, ఈ మధ్య విడుదలై, వీర విహారం చేస్తున్న ‘ఊపిరి’ కూడా ‘ఇన్‌టచ్‌బుల్స్’కి రీమేక్ కావడం విశేషం. శ్రీయ లేటెస్ట్‌గా అంగీకరించినది కూడా ఓ రీమేక్ సినిమానే. ఆ సినిమా ఏంటంటే..
తెలుగులో ‘ఉలవచారు బిర్యాని’, తమిళంలో ‘ఉన్ సమయల్ అరయిల్’ , కన్నడంలో ‘ఒగ్గరణె’ పేరుతో ప్రకాశ్‌రాజ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం గుర్తుండే ఉంటుంది. మలయాళ ‘సాల్ట్ అండ్ పెప్పర్’కి ఇవి రీమేక్. ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి ప్రకాశ్‌రాజ్ సన్నాహాలు మొదలుపెట్టారు. హిందీలో ఆయన దర్శకత్వం వహించనున్న మొదటి సినిమా ఇది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రకాశ్‌రాజ్ చేసిన పాత్రను హిందీలో నానా పటేకర్ చేయనున్నారు. ఆయన సరసన శ్రీయ నటించనున్నారు.
హిందీ చిత్రానికి ‘తడ్కా’ అని టైటిల్ పెట్టారు. ‘‘ఇది చాలా స్వీట్ లవ్‌స్టోరి. గోవాలో షూటింగ్ మొదలుపెట్టనున్నాం. ఎన్నో అవార్డులు పొందిన ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో సినిమా చేయడం, నానా పటేకర్ వంటి సీనియర్ నటుడితో చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు శ్రీయ. మొత్తానికి ‘శివాజీ’ సినిమాలో ‘పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్..’ పాట అంత హుషారుగా శ్రీయ కెరీర్ ఉందన్నమాట.