నా అందానికి కారణం అదేనంటోంది నటి శ్రియ. కథానాయకిగా 15 వసంతాలను టచ్ చేసిన ఈ ఉత్తరాది బ్యూటీ ఇప్పటికీ తన స్థానాన్ని పదిలం పరుచుకుంటూ వస్తోంది. ఇటీవలే రష్యాకు చెందిన తన చిరకాల బాయ్‌ఫ్రెండ్ ఆండ్రును నిడారంబరంగా పెళ్లి చేసుకున్న శ్రియ నటనను మాత్రం కొనసాగిస్తూనే ఉంది. ఈ అమ్మడు అరవిందస్వామితో కలిసి నటించిన నరకాసురన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా శ్రియతో చిన్న భేటీ.
ప్ర: నరకాసురన్ ఏ తరహా చిత్రం? అందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
జ: నిజం చెప్పాలంటే ఇది దర్శకుడి చిత్రం. నాకు చిత్రం చూపించారు. చూశాక ఆశ్చర్యపోయాను. ఒక పజిల్‌ను ముక్కలు ముక్కలుగా పడేసి వాటిని మళ్లీ కరెక్ట్‌గా పేరుస్తారు. అలాంటి ఒక పజిల్ లాంటిదే ఈ చిత్ర కథ. పజిల్‌ను కరెక్ట్‌గా పెట్టకుంటే పరిపూర్ణ చిత్రం కాలేదు. అలానే ఇందులోని ప్రతి పాత్ర ఉంటుంది. నరకాసురన్ అనే పజిల్ ఆటలో నా పాత్రనే కాదు ఏ పాత్రను విడదీసి చెప్పలేం. అంత చక్కని స్క్రీన్ ప్లేతో కూడిన చిత్రం ఇది. చిత్ర కథ మధ్య నుంచి మొదలైనా తొలి ఐదు నిమిషాల చిత్రాన్ని చూడడం మిస్ అయినా చిత్రం అర్థం కాదు. అంత పకడ్బందీగా స్క్రీన్‌ప్లేను దర్శకుడు నరేన్ రాసుకున్నారు. నా పాత్రతోనే కథ ముఖ్య మలుపు తిరుగుతుంది. అరవిందస్వామి ధృవ అనే పాత్రలో నటించారు. నేను ఆయన భార్యగా సీత అనే పాత్రలో నటించాను. చాలా అమాయకపు అమ్మాయిగా, ఏ విషయాన్ని సీరియస్‌గా తీసుకోని వినోదభరిత పాత్రలో నటించాను. అండర్‌ప్లే చేసి నటించే అవకాశం నాకీ చిత్రంలో లభించింది. తెలుగు చిత్రం మనం తరువాత అంతగా ప్రేమించి నటించిన చిత్రం నరకాసురన్.
ప్ర: చిత్ర కథ గురించి?
జ: కథ గురించి చెప్పడం కుదరదు గానీ, కాన్సెప్ట్ చెబుతాను. నరకాసురన్ ఊరు పేరు పేరు కాదు. ఊర్లో పలు ప్రాంతాలు ఉంటాయి. అందులో ఒక ప్రాంతం గురించి ప్రజల్లో ఉండే నమ్మకం. అది మత పరంగా చూసే వారు కావచ్చు, మర్మంతో కూడిన ప్రాంతంగా మరికొందరు చూడవచ్చు. అలాంటి పలువురు దృష్టి కోణాలను చిత్రాన్ని దర్శకుడు చక్కగా బ్యాలెన్స్ చేశారు.
ప్ర: అరవిందస్వామితో కలిసి నటించిన అనుభవం గురించి?
జ: ఆయనతో నటించడం చాలా సులభం అనిపించింది. అరవిందస్వామి నటించిన పలు చిత్రాలను నేను చూశాను. ఈ చిత్రంలోని కథా పాత్రకు నేను నప్పుతానని భావించింది అరవిందస్వామినే. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేయడానికి ఈ చిత్రం కోసం శ్రమించి నటించాను. ఆయనతో కలిసి నటించిన సన్నివేశాల్లో నేను ఇంకాస్త అందంగా కనిపించాననే భావన చిత్రం చూసిన వారికి కలుగుతుంది.
ప్ర: గత 15 ఏళ్లుగా అదే రూపం.అదే అందం. ఇది శ్రియకు మాత్రమే ఏలా సాధ్యం?
జ: ఎప్పుడూ నన్ను నేను సంతోషంగా ఉంచుకుంటాను. నిత్యం శారీరక వ్యాయామాలు తప్పనిసరి. ఇక డాన్స్‌పై నాకున్న అమిత ప్రేమ నా అందానికి ప్రధాన కారణం అనుకుంటాను. మంచి కథక్ డాన్సర్ అని నన్ను నేను గౌరవించుకుంటాను. నిత్యం చేసే ధ్యానం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. వీటిలో పాటు ఎక్కువగా పయనం చేస్తాను. పయనంలో కొత్త కొత్త వ్యక్తులను కలుసుకుంటాను. వారితో మాట్లాడతాను. ఇది మనసును, ఆలోచనలను ప్రశాంతంగా ఉంచడానికి దోహదపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment