సినిమాల నుంచి కాస్తా విరామం తీసుకున్న శ్రుతిహాసన్ సంగీతంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. గతేడాది స్వయంగా తన బృందంతో లండన్‌లో తాను కంపోజ్ చేసిన పాటలను ప్రదర్శించి అక్కడి అభిమానులను అలరించింది. అయితే మైఖేల్ కోర్సెల్ అనే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగిన శుత్రికి ఇటీవల వీరి బంధానికి బ్రేక్ పడటంతో మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న‘లాభం’ సినిమాలో నటిస్తుండగా.. తెలుగులో గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న మాస్ మహారాజ్ రవితేజ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాల విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. జీవితానికి విశ్రాంతి, ప్రశాంతత ఎంతో అవసరమని.. సినిమాలను, మ్యూజిక్‌ను సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నట్లు ఆమె తెలిపారు. అలాగే ఆమె తల్లిదండ్రులు(కమల్‌హాసన్, సారికా) విడిపోవడం గురించి, అది ఆమెకు నేర్పిన విషయాలను సైతం షేర్ చేసుకున్నారు. ఎంత మంచి కుటుంబం నుంచి వచ్చిన వారికైనా బాధలు, సమస్యలు తప్పనిసరిగా ఉంటాయన్నారు. కుటుంబంలో తల్లిదండ్రులు కలిసున్నప్పటికీ ఏ కుటుంబంలో అయినా సమస్యలు ఉంటాయని, అవి కూడా లైఫ్‌లో భాగమని పేర్కొన్నారు.
ఇక తన తల్లిదండ్రులు గురించి మాట్లాడుతూ.. ‘ఇద్దరు వ్యక్తులు విడిపోతే అది తప్పకుండా బాధాకరమైన విషయమే కానీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉండలేనప్పుడు విడిపోయి జీవించడమే మేలు. నేను చూసిన వారిలో చాలామంది భార్యభర్తలు విడిపోయారు. ఇది ఇతరులకు మాత్రమే విషయం.. ఆ కుటుంబానికి కాదు. వారు తీసుకున్న నిర్ణయంతో వారితో పాటు నేను కూడా సంతోషంగానే ఉన్నాను. ఎందుకంటే వారిద్ధరూ కూడా వారి వారి వ్యక్తిగత జీవితాలలో ఆనందంగానే ఉన్నారు. వారు నా తల్లిదండ్రులు కాకముందే ఇద్దరు వ్యక్తులు.. వాళ్లకూ వ్యక్తిగత విషయాలు ఉంటాయి. సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఈ విషయమే నేను ఎప్పుడూ చెబుతుంటాను’ అని ఆమె తల్లిదండ్రుల గురించి చెప్పుకొచ్చారు శృతిహాసన్.
Comments
Please login to add a commentAdd a comment