
తమిళసినిమా: సినీ హీరోయిన్లపై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా అభిమానుల్లో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అదేవిధంగా హీరోయిన్లకూ సహ నటీనటులపై ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఇక్కడ అందరికీ అందరూ నచ్చాలని గానీ, నచ్చకూడదనీ రూలేం ఉండదు. ఇక సంచలన నటి శ్రుతిహాసన్ విషయానికి వస్తే తన మనసులో ఏం అనిపిస్తే అది నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. ఈమె నటించింది తక్కువ చిత్రాలే అయినా, విజయాల శాతం ఎక్కువే. అభిమానులూ అధికమే. ఇటీవల నటనకు కాస్త దూరం అయినా అభిమానుల్లో మాత్రం శ్రుతిహాసన్‌కు క్రేజ్ చెక్కు చెరగలేదు. అదేవిధంగా తను తరచూ అభిమానులతో ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ముచ్చటిస్తూ ఉంటుంది. వారి ప్రశ్నలకు బదులిస్తుంది కూడా.
ఇటీవల ఈ సంచలన తార వేలూర్‌లోని కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు శ్రుతిహాసన్ చాలా సహనంగా బదులిచ్చింది. అందులో మీకు నచ్చిన చిత్రం ఏమిటన్న ప్రశ్నకు ఏ మాత్రం ఆలోచించకుండా మహానది అని బదులిచ్చింది. ఇది తన తండ్రి కమలహాసన్ నటించిన చిత్రం అన్నది గమనార్హం. ఉత్తమ నటుడు కమలహసన్ అని చెప్పింది. సినీరంగంలో మీరు కోరుకునేది? అన్న ప్రశ్నకు తాను నటిగా, గాయనిగా, సంగీతదర్శకురాలి పేరు తెచ్చుకున్నా, వీటన్నింటిలోనూ తాను కోరుకునేది ఎంటర్‌టెయిన్‌మెంట్‌నేనని చెప్పింది. మీరు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించారు. అందులో ఏ చిత్ర పరిశ్రమ ఉన్నతంగా అనిపించింది? అని ఓ విద్యార్థిఅడిగిన ప్రశ్నకు తాను ఏ భాషలో పని చేసినా నటననే ఇష్టపడి చేస్తానని చెప్పింది. నటుడు అజిత్ గురించి మీ అభిప్రాయం అన్న ప్రశ్నకు తనకు బాగా ఇష్టమైన నటుల్లో ఆయన ఒకరని చెప్పింది. తాను కలిసిన నటుల్లో సంప్రదాయమైన నటుడు అజిత్ అని శ్రుతిహాసన్ చెప్పింది. ఈ బ్యూటీ అజిత్‌తో వేదాళం చిత్రంలో నటించిందన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment