నేను కూడా అలాంటిదాన్నే!
‘‘మైనపు ముద్దను మన ఇష్టం వచ్చిన రూపానికి మల్చుకోవచ్చు. నేను కూడా అలాంటిదాన్నే. దర్శకుడు నన్ను ఏ పాత్రకైనా మల్చుకోవచ్చు. నేను డెరైక్టర్స్ ఆర్టిస్ట్‌ని. డెరైక్టర్ నవ్వమంటే నవ్వుతా.. ఏడవమంటే ఏడుస్తా. ఈ సీన్‌లో ఎందుకేడ్వాలి? ఎందుకు నవ్వాలి? అని ప్రశ్నించను’’ అంటున్నారు శ్రుతీ హాసన్. అడపా దడపా మాత్రమే కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తున్నారామె. చాలావరకు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు చేస్తున్నారు శ్రుతి.
సినిమా పరిశ్రమలో పురుషాధ్యికత ఉంటుంది కాబట్టే, కథానాయికా ప్రాధాన్య చిత్రాల సంఖ్య తక్కువగా ఉంది కదా? అనే ప్రశ్న శ్రుతీ హాసన్ ముందుంచితే -‘‘తెలుగు పరిశ్రమ మేల్ డామినేటెడ్ కదా? అని ఆ మధ్య ఎవరో నన్నడిగారు. ఒక్క తెలుగు పరిశ్రమ ఏంటి? అసలీ ప్రపంచంలో పురుషాధిక్యం లేనిదెక్కడ? సమాజం తీరు అలా ఉన్నప్పుడు సర్దుకుపోవడమే. అయితే ఆడవాళ్లందరూ అణిగి మణిగి బతకాలని నేను అనను. మన ఆత్మాభిమానం దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు ఎదురు తిరగాలి. మన హక్కులను పూర్తిగా వినియోగించుకోవాలి. తలదించుకుని కాదు.. తలెత్తుకుని బతకాలి. అప్పుడే పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ ఉనికిని కాపాడుకోగలుగుతాం’’ అని చెప్పారు.