shurthi Hassan
-
మా తల్లిదండ్రులు విడిపోవడమే మంచిదయింది! : శ్రుతిహాసన్
కమల్‌హాసన్, సారికల పెద్ద కుమార్తె, హీరోయిన్ శ్రుతీహాసన్ దాదాపు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంటారు.. ఇటీవల ఓ సందర్భంలో తన తల్లిదండ్రులు విడిపోయిన విషయం గురించి మాట్లాడారు శ్రుతి. వాళ్లు విడాకులు తీసుకున్నప్పుడు తనకు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది అన్నారామె. ఇంకా శ్రుతి మాట్లాడుతూ – ‘‘మా అమ్మానాన్న విడాకులు తీసుకున్నప్పుడు నేను ఎగ్జయిట్ కావడానికి కారణం ఉంది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంలేదని వారికి అనిపించింది. ఆ తర్వాత విడాకులు తీసుకోవాలనుకున్నారు. భిన్నాభిప్రాయాలున్న వ్యక్తులు కలసి బతకడం కంటే విడిపోవడం కరెక్టేనని, వారి నిర్ణయం గౌరవించదగ్గదేనని అనిపించింది. వ్యక్తులుగా వారు విడిపోయినా తల్లిదండ్రులుగా నాకు, నా చెల్లెలి (హీరోయిన్ అక్షరా హాసన్)కి వారి బాధ్యతలను నిర్వహిస్తూనే ఉన్నారు. వ్యక్తిత్వాలు వేరుగా ఉన్న ఇద్దరు అద్భుతమైన వ్యక్తులు నా తల్లిదండ్రులు. వారు విడాకులు తీసుకున్నప్పుడు నేను యంగ్ ఏజ్‌లో ఉన్నాను. మా తల్లిదండ్రులు కలిసి లేరన్న విషయాన్ని పక్కన పెడితే, విడివిడిగా ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు. అలా హ్యాపీగా ఉండటం ముఖ్యం కదా’’ అన్నారు. 1988లో పెళ్లి చేసుకున్న కమల్, సారిక 2004లో విడాకులు తీసుకున్నారు. -
నేను కూడా అలాంటిదాన్నే!
‘‘మైనపు ముద్దను మన ఇష్టం వచ్చిన రూపానికి మల్చుకోవచ్చు. నేను కూడా అలాంటిదాన్నే. దర్శకుడు నన్ను ఏ పాత్రకైనా మల్చుకోవచ్చు. నేను డెరైక్టర్స్ ఆర్టిస్ట్‌ని. డెరైక్టర్ నవ్వమంటే నవ్వుతా.. ఏడవమంటే ఏడుస్తా. ఈ సీన్లో ఎందుకేడ్వాలి? ఎందుకు నవ్వాలి? అని ప్రశ్నించను’’ అంటున్నారు శ్రుతీ హాసన్. అడపా దడపా మాత్రమే కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తున్నారామె. చాలావరకు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు చేస్తున్నారు శ్రుతి. సినిమా పరిశ్రమలో పురుషాధ్యికత ఉంటుంది కాబట్టే, కథానాయికా ప్రాధాన్య చిత్రాల సంఖ్య తక్కువగా ఉంది కదా? అనే ప్రశ్న శ్రుతీ హాసన్ ముందుంచితే -‘‘తెలుగు పరిశ్రమ మేల్ డామినేటెడ్ కదా? అని ఆ మధ్య ఎవరో నన్నడిగారు. ఒక్క తెలుగు పరిశ్రమ ఏంటి? అసలీ ప్రపంచంలో పురుషాధిక్యం లేనిదెక్కడ? సమాజం తీరు అలా ఉన్నప్పుడు సర్దుకుపోవడమే. అయితే ఆడవాళ్లందరూ అణిగి మణిగి బతకాలని నేను అనను. మన ఆత్మాభిమానం దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు ఎదురు తిరగాలి. మన హక్కులను పూర్తిగా వినియోగించుకోవాలి. తలదించుకుని కాదు.. తలెత్తుకుని బతకాలి. అప్పుడే పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ ఉనికిని కాపాడుకోగలుగుతాం’’ అని చెప్పారు.